పవన్ ప్లేస్ మారింది!… త్యాగాలు చేయాల్సిన తమ్ముళ్లు వీరే!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపైనే పూర్తి కసరత్తులు చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే వైఎస్ జగన్ మూడు విడతలుగా పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పులకు శ్రీకారం చుట్టి.. ప్రస్తుతం నాలుగో విడత జాబితాపై కసరత్తులు చేస్తున్నారు. మరోపక్క తాజాగా చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో టీడీపీ-జనసేన సీట్లపై కసరత్తులు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది.

పొత్తులో భాగంగా జనసేనకు టీడీపీ నుంచి కొన్ని సీట్లు కేటాయించాల్సిన ఉండగా… అవి ఎన్ని అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదని తెలుస్తుంది. అయితే… కనీసం 40 సీట్లకు తగ్గకుండా తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పినట్లు తాజా చేగొండి హరి రామ జోగయ్య స్పష్టం చేసారు. అయితే టీడీపీ నుంచి అంతమంది త్యాగాలకు సిద్ధంగా లేరని తెలుస్తుంది.

దీంతో పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకుకోపం అన్నట్లుగా మారిందని అంటున్నారు. ఈ సమయంలో… 20 సీట్లకు మించి జనసేనకు దక్కే అవకాశం కనిపించటం లేదనే మాట టీడీపీ సర్కిల్స్ నుంచి బలంగా వినిపిస్తుంది. అక్కడికే చంద్రబాబుకు తలప్రాణం తోకకు వచ్చేస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి తొలివిడతలో భాగంగా… 16 సీట్లు జనసేనకు కేటాయించారని తెలుస్తుంది.

దీంతో ప్రస్తుతానికి 16మంది టీడీపీ నేతలు తమ తమ స్థానాలను జనసేన నేతలకు త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా… ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం… జనసేకు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకస్థానం నుంచి పవన్ కల్యాణ్ అన్న… నాగబాబు పోటీచేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికొస్తే… శ్రీకాకుళం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, విజయవాడ వెస్ట్, చీరాల, దర్శి, తిరుపతి, మాడుగుల, పోలవరం, పెడన, నంద్యాల, అనంతపురం రూరల్, ధర్మవరం, కల్యాణ్ దుర్గం, పూతలపట్టు స్థానాలు జనసేనకు కేటాయించేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో త్యాగాలు చేయాల్సిన టీడీపీ నేతలపై చర్చ మొదలైంది.

పవన్ పోటీ చేసే స్థానం మార్పు!:

ప్రస్తుతానికి జనసేనకు కేటాయించినట్లు చెబుతున్న స్థానాల సంగతి అలా ఉంటే… ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేసే స్థానంపైనా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈసారి భీమవరం, గాజువాక నుంచి పవన్ పోటీచేయడం లేదని అంటున్నారు. ఈ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి లేదా… తిరుపతి నుంచి పవన్ పోటీచేసే అవకాశం ఉందని చెబుతున్నారు.