ఎవరు ఏమనుకున్నా.. జనసేన నాయకులు, జనసైనికులు ఎంత ఫీలయినా… తాను మాత్రం టీడీపీ తానులో ముక్కనే అనే సంకేతాలు నిత్యం ఇస్తూనే ఉంటారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మరి కల్యాణ్ బాబుని అంతగా ప్రభావితం చేసిన చంద్రబాబులోని ఆ మేటర్ ఏమిటో తెలియదు కానీ… పైకి ఎన్ని చెప్పినా, వేదికలపై ఎన్ని మాట్లాడినా, జనసైనికులు ఎంతమొత్తుకున్నా… పవన్ మాత్రం తాను చంద్రబాబు మనిషిని, టీడీపీ మద్దతుదారుడిని అని చెప్పుకోవడంలో తన తాపత్రయాన్ని తగ్గించుకోవడం లేదు. అందుకు తాజా ఉదాహరణ.. ఏపీ అసెంబ్లీలో తన్నులాట!
అవును… ఏపీ అసెంబ్లీలో సోమవారం జరగకూడని ఒక సంఘటన జరిగింది. అసెంబ్లీలో అల్లరి చేయడం అలవాటుగా మార్చుకున్న టీడీపీ నేతలు జీవో నెంబర్ 1 రద్దుపై పట్టుబట్టడం, అందులో భాగంగా ఏకంగా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం, స్పీకర్ ఫేస్ పై ఫ్లకార్డులు పెట్టడం, కాగితాలు చింపి స్పీకర్ పై వేయడం జరిగింది. దీనికి ఏమాత్రం తగ్గకుండా.. టీడీపీ నేతలతో వాగ్వాధానికి దిగారు అధికారపక్ష నేతలు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. రాజకీయ రచ్చకు, ముష్ఠి యుద్దాలకు ఏపీ అసెంబ్లీ వేదికైంది.
ఈ ఘటనను ప్రజాస్వామ్యవాదులు, సీనియర్ రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు మొదలైనవారంతా ముక్త కంఠంతో ఖండించారు. ఇక ఎస్సీలపై దాడి చేసింది ఆ పార్టీ ఎమ్మెల్యేలని, బీసీలపై దాడి చేయాలని చేసింది ఈ పార్టీ ఎమ్మెల్యేలని.. ఇలా ఎవరి వెర్షన్ వారు చెప్పుకున్నారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. అయితే ఈ విషయంలో జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
ఏపీ అసెంబ్లీలో జరిగిన రచ్చపై స్పందించిన జనసేన అధినేత… చట్టసభల గౌరవాన్ని, హుందాతనాన్ని సభ్యులు పరిరక్షించాలని కోరుతూ… ఇలాంటి ఘటనలతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. అక్కడితో ఆగితే తన స్థాయి పెరుగుతుందని భయపడ్డారో… లేక, అక్కడితో ఆపితే బాబు ఫీలవుతారని భావించారో… తెలియదు కానీ… టీడీపీ నేతలపైనే దాడి జరిగిందని తేల్చేశారు జనసేన అధినేత. ఇక ఈ వకాల్తా కొనసాగించిన పవన్… టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని.. జీవో నెంబర్-1పై చర్చకు స్పీకర్ అనుమతించకపోవడం దారుణం అని చెప్పేశారు.
అలా టీడీపీపై తనకున్న అభిమానాన్ని చాటుకునే క్రమంలో మరో అడుగుముందుకేసిన పవన్… చట్ట సభలలో అర్థవంతమైన చర్చలు చేసి ప్రజలకు మేలు చేస్తారని అందరం ఆశిస్తామని, పరిపాలన విధానాల్లో ప్రజా ప్రయోజనాలకి విరుద్ధంగా ఉన్నవాటిపై చర్చ చేయాలని, చర్చ కోసం పట్టుబడితే దాడి చేయడం భావ్యం కాదని ప్రకటించారు. దీంతో జనసైనికులు తెగ ఫీలయిపోతున్నారు. “మేము ఎక్కడికో తీసుకెళ్దామని అనుకుంటాం.. కానీ, ఆయన అక్కడకి రారు, సైకిల్ దిగరు, పసుపు రంగు కడుక్కోరు” అంటూ కామెంట్లు చేస్తున్నారు!
ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు… న్యూట్రల్ గా స్పందిస్తూ.. ఇరు వర్గాలనూ విమర్శిస్తూ, జరిగిన సంఘటనను ఖండించి ఉంటే.. పవన్ లెక్క వేరే ఉండేదనేది జనసైనికుల మాట. అప్పుడే కదా.. టీడీపీ – వైసీపీ కాకుండా… మూడో పార్టీ ఉందని, మరో ప్రత్యామ్నాయం తమకు ఉందని ప్రజలు భావిస్తారు అనేది వారి ఆవేదన! జనసైనికులు ఇంత మెచ్యూర్ గా ఆలోచిస్తుంటే… “పవన్ మాత్రం ఆ పసుపు రంగు పూసుకోవడానికే ఎక్కువ తాపత్రయం చూపించడం జనసైనికుల దురదృష్టం” అని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు!