జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమవరంలో వున్నారు. ఓ వైపు వారాహి యాత్ర.. ఇంకో వైపు తన కొత్త సినిమా ‘బ్రో’ టీజర్ సంబంధిత వ్యవహారాలు.. వెరసి, బిజీగానే వున్నారు పవన్ కళ్యాణ్. నిన్ననే టీజర్ తాలూకు డబ్బింగ్ విషయాలుంటే, భీమవరంలోనే పూర్తి చేసేశారు.
వాట్ నెక్స్‌ట్.? ఈ రోజు భీమవరంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారబ్బా.? రేపైతే బహిరంగ సభ వుంది. దానికి సంబంధించి స్క్రిప్ట్ తదితర వ్యవహారాల్లో పవన్ కళ్యాణ్ తలమునకలై వున్నారన్నది ఓ వాదన.
2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గం కదా.? అందుకే, భీమవరంలో ఎక్కువ రోజులు హాల్ట్ వేశారు జనసేనాని. ఓటమికి కారణాల్ని ఇప్పుడు తీరిగ్గా విశ్లేషిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తాం.? అన్నదానిపై స్థానికంగా కొన్ని సర్వేలు కూడా చేయించుకని.. వాటి గురించి చర్చిస్తున్నారట జనసేనాని.. అత్యంత సన్నిహతులతో.
2024 ఎన్నికల్లో భీమవరం నుంచే పోటీ చేస్తే విజయావకాశాలు ఎలా వుంటాయ్.? అన్నదానిపై స్థానిక నాయకత్వం, జనసేనానికి ఓ రిప్రెజెంటేషన్ కూడా ఇచ్చిందనీ, దాన్ని పవన్ ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారనీ చెబుతున్నారు.
రేపటి బహిరంగ సభలో, భీమవరం నుంచే తాను పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించొచ్చన్నది ఓ వాదన. అయితే, అలాంటి ప్రకటన ఏదీ చేయవద్దని జనసేనానికి స్థానిక నాయకులు కొందరు సూచిస్తున్నారట.
కింది స్థాయిలో పని మాత్రం ప్రారంభించేశారనీ, జనసేనాని భీమవరం నుంచే మళ్ళీ పోటీ చేసే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది.