బ్రేకింగ్: జనసేన మొదటి అభ్యర్థి బిసి, పవన్ సంచలనం

ఆంధ్రాలో సార్వత్రిక ఎన్నికల హడావిడి మొదలయ్యింది. అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు పార్టీల అధినేతలు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి తమ పార్టీ తరఫున పోటీ చేసే తొలిఅభ్యర్థిని ప్రకటించారు. తొలిసీటు కూడా వెనకబడిన వర్గాానికి వెళ్లింది.  చాలా రోజులుగా  అభ్యర్థుల ఎంపికపై పవన్ చడీ చప్పుడు లేకుండా కసరత్తు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఏపీలో జనసేన తరపున పోటీ చేయనున్న మొదటి అభ్యర్థిని ప్రకటించి సంచలనం సృష్టించారు పవన్. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం టికెట్ ను పితాని బాలకృష్ణకు ఖరారు చేసినట్లు ప్రకటించారు. పితాని శెట్టి బలిజ (బిసి)కులానికి చెందిన నాయకుడు. గతంలో ఆయన వైసిపిలో ఉండేవారు. తర్వాత జనసేనలో చేరారు.

కాగా పితాని బాలకృష్ణను మొదటి అభ్యర్థిగా ప్రకటించటంలో ఒక విశేషం దాగి ఉంది. పవన్ కళ్యాణ్ తండ్రి కానిస్టేబుల్ గా పని చేశారు. అయితే ఆ రంగానికే చెందిన పితానికి తొలి సీటు ప్రకటిచటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

అంతేకాదు, పవన్ తొలి అభ్యర్థి కాపు అయివుంటాడనుకున్న వాళ్లకి ఇది షాక్. ఎందుకంటే, తనకు కాపు ముద్రవేయవద్దనేందుకు చేసిన ప్రయత్నం కూడా పీతాని పేరు ప్రకటించడంలో కనిపిస్తుంది. అంతేకాదు, ఆ జిల్లాలో కాపులకు, శెట్టి బలిజలకు చాలా కాలంగా వైరం నడుస్తూ ఉంది. జిల్లాలకు ఈ వర్గం మద్దతు కూడగట్టుకోవడం పవన్ కు చాలా అవసరం. దానికి తోడు ఇటీవల కాపు రిజర్వేషన్ ల డిమాండ్ వల్ల కూడా కాపులకు బిసిలకు బాగా గ్యాప్ వచ్చింది. బిసి ప్రయోజనాలను దెబ్బతిసే విధంగా తాను ప్రయత్నించనని చెప్పేందుకు కూడా  పవన్ ఈ రోజు ప్రయత్నించారు. అందువల్ల పీతాని బాలక్రిష్ణ పేరు ఆషామాషీగా ప్రకటించింది కాదు. చాలా లోతైన రాజకీయ నిర్ణయం.

2019 లో జరిగే ఎన్నికల్లో జనసేన ఏపీలోని 175 నియోజకవర్గాల నుండి పోటీ చేయనున్నట్లు ముందుగానే ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఆయన సినిమాలను కూడా పక్కన పెట్టి పూర్తి స్థాయిలో రాజకీయ రంగంపైనే దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రమంతటా పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజలకు మరింత చేరువ అవడానికి ప్రయత్నిస్తున్నారు పవన్.