జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. వారాహియాత్ర సభల్లో వాలంటీర్లపై చేసిన ఆరోపణలు ఏస్థాయిలో దుమారం లేపాయో తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలు చేసి వారం గడిచినా ఆ దుమారం తగ్గట్లేదు.. తగ్గేదేలేదు అని అంటున్నారు పరిశీలకులు. పవన్ పై వాలంటీర్లు, సామాన్యులు, వైసీపీ నేతలు నిప్పులు కక్కుతున్నారు.
ఇందులో భాగంగా… రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు రోడ్డెక్కారు. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆయన ఫొటోలు, ఫ్లెక్సీలను చెప్పులతో తొక్కారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పేంత వరకూ వెనక్కి తగ్గబోమంటూ హెచ్చరించారు. ఇక వైసీపీ నేతలు మైకులముందుకు వచ్చి పవన్ ని వివస్త్రుడిని చేసి కుర్చోబెట్టినంత పనిచేస్తున్నారని అంటున్నారు.
ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా వాలంటీర్లను లక్ష్యంగా చేసుకుంది. అమరావతిలో ఇటీవలే నిర్వహించిన పార్టీ సమావేశంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. డేటా చోరీకి పాల్పడుతోన్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయంటూ ధ్వజమెత్తారు.
ఈ సమయంలో తాజాగా ఒక పెయింటింగ్ పిక్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది. ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు, వాలంటీర్లు, సామాన్య ప్రజానికం, వాలంటీర్ల సేవలు పొందుతున్న జనాలు… ఈ పిక్ ను వైరల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యన్నారాయణ తన ట్విట్టర్ లో ఈ ఆర్ట్ పిక్ ని పోస్ట్ చేశారు.
“ఈరోజు మనమంతా చూస్తున్నాం… ప్రజలకు మేలు చేస్తున్న వాలంటీర్లపై, వాలంటీర్ వ్యవస్థపై కొంతమంది నరరూప రాక్షసులు ఎలా నీచాతినీచంగా దాడి చేస్తున్నారో!
వీరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకి మంచి చేసే ఈ వ్యవస్థను రద్దు చేస్తారట!
రాష్ట్ర ప్రజలంతా మళ్లీ ప్రభుత్వ పథకాలు పొందడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొస్తారట! మళ్లీ జన్మభూమి కమిటీల్లాంటి వ్యవస్థను తీసుకొచ్చి, పెత్తందారులకు లంచాలు ఇచ్చి పనులు చేయించుకునే పాత పద్ధతికి శ్రీకారం చుడతారట!
ప్రజలంతా ఒక్కసారి ఆలోచన చేయండి… మనకి ఎలాంటి వ్యవస్థ కావాలి అని!
ప్రజలకు మేలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై నీచమైన మాటలతో విరుచుకుపడుతున్న కొంతమంది రాజకీయ నాయకులకి ఏవిధంగా బుద్ధి చెప్పాలో మీరే నిర్ణయించండి” అని ట్విట్టర్ లో సూచించారు. ప్రాస్తుతం ఈ ఆర్ట్ వర్క్ వైరల్ అవుతుంది.