పవన్ ను కెలికి వదిలేసిన బాబు… షాపింగ్ కంటిన్యూ చేస్తారా?

తెలిసి చేశారో.. తెలియక చేశారో.. వ్యూహత్మకంగా అన్నారో.. నిజంగానే అన్నారో తెలియదు కానీ… గతంలో ఒకసారి చంద్రబాబు.. పవన్ కు ప్రపోజ్ చేశారు! ఓ కార్యకర్త అడిగిన ప్రశ్నకు స‌మాధానంగా… “పవన్ తో తనది వన్ సైడ్ లవ్” అని చంద్రబాబు సంచలన కామెంట్ చేశారు. తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో ఇద్దరూ హోటల్స్ లో కూడా కలుసుకున్నారు. అయితే.. ప్రస్తుతం బాబు.. తనకు తాను బ్రతికేయగలననే నమ్మకాన్ని కనబరుస్తూ.. పవన్ ని ఒంటరివాడిని చేసేస్తున్నారనే కామెంట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

చంద్రబాబు.. బహిరంగంగా పవన్ పై తన ప్రేమను వ్యక్తపరిచి చాలా కాలమే అయ్యింది. ఈ సమయంలో ఈ బహిరంగ లవ్ ప్రపోజల్ కి పవన్ ప్రత్యక్షంగా “ఓకే” చెప్పకపోయినా… లోలోపల మాత్రం డ్రీము సాంగులు వేసుకుంటూనే ఉన్నారు.. తానుకూడా చంద్రబాబుతో లవ్ లో ఉన్నట్లు కేడర్ కు పరోక్షంగా సంకేతాలు పంపుతూనే ఉన్నారు! అయితే ఈ సమయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల రూపంలో బాబు మనసు మారింది. పవన్ నుంచి చూపు మెళ్లమెళ్లగా పక్కకు తిరిగింది!

దీంతో… చంద్రబాబు ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు. పొత్తుల గురించి మాట్లాడ్డం మానేశారు. పవన్ ప్రస్థావనే తీసుకురావడం లేదు. ఇదే క్రమంలో… అస‌లు పొత్తుల గురించిన ఆలోచ‌నే త‌మ‌కు లేద‌ని ఇటీవ‌ల అచ్చెన్నాయుడు అన్నారు. ప్రస్తుతం పార్టీ బ‌లోపేతం, అభ్యర్థుల ఎంపిక‌పైనే తమ దృష్టంతా ఉందని స్పష్టం చేశారు. ఈ సమయంలో.. ఒకేసారి సడన్ “నో” చెబితే పవన్ హర్ట్ అవుతారని భావించారో ఏమో కానీ… “ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఆలోచిస్తాం” అని స్లోగా నేరేట్ చేశారు!

ఆ ఒక్క మాటలో ఎంత అర్ధం ఉందో గ్రహించలేని పవన్… ఇంకా బాబు నుంచి మిస్డ్ కాలో, మెసేజో రాకపోద్దా అని ఎదురుచూస్తున్నారు. అచ్చెన్న చెప్పన మాటల ప్రకారం… ఎన్నికల వరకూ పార్టీ బలోపేతంపై దృష్టి సారించే చంద్రబాబు… ఆ సమయానికి తమ పార్టీ పరిస్థితిని బట్టి పొత్తు కబురు పంపుతారు. అప్పటికి టీడీపీ బలంగా ఉంటే… పవన్ కు ఫోన్ వెళ్లదు. అప్పటికి టీడీపీ బలహీనంగా ఉన్నా, వైసీపీ ఇంకా బలపడినా… అప్పుడు పవన్ కు ఫోన్ వెళ్తుంది.. ఒక టెక్స్ట్ మెసేజ్ విత్ లవ్ సింబల్ పంపబడుతుంది!

అంటే… ప్రస్తుతానికి పవన్ ని బాబు స్టాండ్ బై లో పెట్టారన్న మాట. అంటే పొలిటికల్ వెబ్ సైట్ లో చంద్రబాబు.. జనసేనను “కార్ట్” లో పెట్టారు. అప్పుడు అవసరమైతే కార్టుపై క్లిక్ చేసి షాపింగ్ కంటిన్యూ చేస్తారు.. అవసరం లేని పక్షంలో… కార్ట్ నుంచి డిలీట్ చేస్తారన్నమాట! ఈలోపు పవన్… తాను సొంతంగా పోటీ చేస్తానున్నామనే భావనలోనే పార్టీ కేడర్ ని సిద్ధం చేయడం మానేసి… మ‌న‌తో సయోధ్యగా ఉన్న రాజ‌కీయ పక్షాల నాయకుల విమర్శలను సీరియస్ గా తీసుకోవద్దని కేడర్ కు సూచిస్తున్నారు!

సపోజ్.. పర్ సపోజ్… అప్పుడు చంద్రబాబుకి జనసేన అవసరం లేకపోతే…?