రాజకీయం కంటే రాష్ట్రమే ముఖ్యం: పవన్ కళ్యాణ్

‘రాష్ట్రం కోసం రాజకీయాల్ని పక్కన పెడతాం. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించిన తీరుకి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ విమర్శలకు తావివ్వబోమంటూ జనసేన అధినేత స్వయంగా వెల్లడించారు.. అదీ సోషల్ మీడియా వేదికగా. రాష్ట్రానికి మంచి పెట్టుబడులు రావాలనీ, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు.

జీఐఎస్ సమ్మిట్ నేపథ్యంలో ఎలాంటి రాజకీయ విమర్శలూ జనసేన పార్టీ తరఫున చేయబోమని జనసేన అధినేత ప్రకటించడం గమనార్హం. అయితే, జనసేన అధినేత స్పందన పట్ల ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ గుస్సా అవుతోంది. సోషల్ మీడియా వేదికగా జనసేన – వైసీపీ మీద టీడీపీ మద్దతుదారులు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

‘ప్యాకేజీ ఈసారి వైసీపీ నుంచి అందిందా.?’’ అంటూ జనసేన మీద టీడీపీ మద్దతుదారులైన నెటిజన్లు ఆరోపిస్తుండడం గమనార్హం. కానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎవరైనా రాజకీయాల్ని పక్కన పెట్టాల్సిందేనన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. త్వరలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్న విషయం విదితమే. ఆ వేదికపైనుంచి ఎలాగూ రాజకీయ విమర్శలుంటాయి. రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. అయితే, ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అన్ని రాజకీయ పార్టీలూ గుర్తెరగాలి.

కాగా, టీడీపీ మాత్రమే కాకుండా వైసీపీ మద్దతుదారులైన కొందరు నెటిజన్లు జనసేన పార్టీ మీదా, జనసేన అధినేత మీదా సోషల్ మీడియా వేదికగా రాజకీయ విమర్శలు మాత్రం ఆపడంలేదు.