హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలలో తమ పార్టీ జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని సంచలన ప్రకటన చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ తరుపున కొంత మంది నామినేషన్ కూడా వేశారు. అప్పటివరకు మాకు జనసేన కి ఏ సంబంధం లేదని మాకు మేమే అంటూ ప్రగల్పాలు పోయిన బీజేపీ పార్టీ , తమ అగ్ర నాయకులని పవన్ వద్దకి పంపించి మంతనాలు జరిపి ఒక తాటి మీదకి రావటం జరిగింది. ఆ తర్వాతా పవన్ మరోసారి షాక్ ఇస్తూ ఎన్నికల నుండి తాము తప్పుకుంటున్నట్లు, బీజేపీ పార్టీ కి సపోర్ట్ చేస్తున్నట్లు , అందరూ బీజేపీ పార్టీ కి ఓటు వేసి గెలిపించాలని ప్రకటించటం జరిగింది . పవన్ ఇలా వెంట వెంటనే మాట మార్చేసరికి తమ పార్టీ అభిమానులు మరియు కార్యకర్తలలోనే ఆగ్రహ జ్వాలలు ప్రజ్వరిల్లాయి. ఇక మిగిలిన పార్టీల వారు పవన్ ని చులకన చేసి వారి ఆనందాన్ని బయట పడేసారు.

అసలు పవన్ కళ్యాణ్ ఇలా చేయటంలో చాలా పెద్ద వ్యూహమే ఉందట. ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన మరియు బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకుని రాజకీయంగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. టీడీపీ పార్టీ రోజు రోజుకి పతనమవటంతో వైసీపీ పార్టీ కి ప్రత్యామ్న్యాయాంగా జనసేన , బీజేపీ పార్టీ లే కనిపిస్తున్నాయట. ఆంధ్ర ప్రదేశ్ లో ఇలా ఉంటే తెలంగాణలో మాత్రం అధికార పార్టీని ఒంటారిగానే బీజేపీ పార్టీ ఎదుర్కొంటుంది. ఈ మధ్యన జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలలో బీజేపీ పార్టీ గెలిచి ఊపులో ఉంది. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలలో గట్టిగా ప్రయత్నించి తెరాస పార్టీని గట్టిగా దెబ్బ తీసి ప్రజలని తమ పార్టీ వైపు తిప్పుకోవాలని చూస్తుంది. పొత్తు ధర్మ ప్రకారం రెండు పార్టీ లు ఒకరినొకరు సపోర్ట్ చేస్కుంటూ సమానంగానో లేదా ఇష్ట ప్రకారంగానో అన్నిటిని పంచుకుని రాజకీయంగా ప్రయోజనాలు పొంది అధికారాన్ని ఉమ్మడిగా చేజిక్కించుకుని పరిపాలన చేయాలనుకుంటాయి.

తెలంగాణాలో పరిస్థితులన్నిటిని చూస్తూ ఉన్న పవన్ జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ పార్టీ వాళ్ళు తమ సహాయాన్ని కోరతారని అనుకున్నారట. కానీ దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో వచ్చిన ధీమాతో బీజేపీ పార్టీ తెలంగాణలో ఇక తమకి తిరుగు లేదని గాల్లో విహరిస్తూ ఒంటరిగా పోటీలు చెయ్యాలని ముందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో పవన్ ఎంట్రీ ఇచ్చి మేము కూడా ఒంటరిగానే పోటీ చేయాలనుకుంటున్నామని అందరికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు కథ రసవత్తరంగా మారిపోయింది. జనసేన పోటీ చేస్తే తమకి వచ్చే ఓటుల్లో ఎంతో కొంత తగ్గి విజయానికి దూరమవుతావేమో అని లెక్కలేసుకుని పవన్ దగ్గరకి బీజేపీ పార్టీ అగ్ర నేతలు కిషన్ రెడ్డి మరియు లక్ష్మణ్ లు వచ్చి మంతనాలు జరిపి పవన్ ని ఒప్పించి ఈ ఎన్నికల నుండి పోటీని ఉపసంహరించేలా చేశారు.
ఎలానూ… జనసేన ఒంటరిగా ఈ ఎన్నికలలో పోటీ చేసినా గెలవడం అసాధ్యం. ఇది జనమెరిగిన సత్యం. ఇప్పుడు వారే వచ్చి అడిగారు, పవన్ వారి కోరికని తీర్చారు కాబట్టి ఇందులో పవన్ దే పై చేయి , రేపు ఆంధ్ర లో అవసరమయినప్పుడు తనకి అనుకూలంగా బీజేపీ పార్టీ ఉండటానికి ఇలాంటివి ఉపయోగపడతాయి. ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ తప్పక పవన్ మాట అనుసరించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆంధ్ర లో జనసేనకి ఓటు బ్యాంకు ఉంది. జనసేనతో పొత్తు ఉంటేనే బీజేపీకి ఆంధ్రలో ఉనికి ఉంటుంది. ఇలా బీజేపీ పెద్దల దగ్గర నుండి “అనుకూలస్త్రాన్ని ” పొంది తనకి కావలిసినప్పుడు భవిష్యత్తులో వాడుకుంటాడట. అందరూ పవన్ కి తిక్క ఉందని అనుకున్నారు కానీ ఆ తిక్కకి పవన్ దగ్గర ఒక లెక్క ఉందట.
