ప్రభుత్వంలో వుంటాం.! ఇదేం ప్రకటన పవన్.?

‘వచ్చే ప్రభుత్వంలో మనం ఖచ్చితంగా వుంటాం..’ అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ‘మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..’ అని కదా అనాల్సింది.? 2014 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కలిసి పోటీ చేశాయ్.. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ బీజేపీతో పోల్చితే, జనసేనకు ఓట్లు కాస్త ఎక్కువే కదా.?

నిజానికి, 2014 ఎన్నికల్లోనే టీడీపీ – బీజేపీ – జనసేన కలిసి పోటీ చేయాలి. కానీ, జనసేన కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైంది. జనసేన కూడా పోటీ చేసి, ఓ నాలుగైదు సీట్లు తెచ్చుకోగలిగి వుంటే, 2019 ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు జనసేనకు వచ్చి వుండేవే.! అప్పట్లో వేసిన తప్పటడుగు, జనసేన పార్టీకి వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ సీట్లు వస్తాయా.? రావా.? అన్న అనుమానపు పరిస్థితుల్ని సృష్టించిందన్నది నిర్వివాదాంశం. ఇంత జరిగాక కూడా, జనసేనాని ఆత్మవిమర్శ చేసుకోవడంలేదు.

ప్రభుత్వంలో వుండాలనుకుంటే, వైసీపీతో అయినా జనసేనాని జతకట్టొచ్చు. నిజం మాట్లాడుకోవాలంటే, జనసేనకు వైసీపీ కంటే టీడీపీనే ప్రధాన శతృవు అయి వుండాలి. ప్రజారాజ్యం దగ్గర్నుంచి, ఓ సామాజిక వర్గం.. రాజకీయాల్లో అత్యున్నత స్థానానికి వెళ్ళకూడదని అడ్డు తగులుతున్నది టీడీపీనే.

సరే.. టీడీపీతో కలిసి వెళ్ళాలన్న జనసేనాని ఆలోచన.. అది ఆయన రాజకీయ వ్యూహం. కానీ, టీడీపీని నమ్ముకుంటే ఏం ప్రయోజనం.? ‘మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..’ అని గనుక, పార్టీ శ్రేణులకు జనసేనాని సందేశం ఇవ్వగలిగితే, ఖచ్చితంగా డబుల్ డిజిట్‌ని జనసేన వచ్చే ఎన్నికల్లో టచ్ చేసేందుకు అవకాశం వుంటుంది.

దురదృష్టం, టీడీపీని అధికారంలోకి తెచ్చి, ఆ ప్రభుత్వంలో మనమూ వుందాం.. అన్నట్టుగా జనసేనాని చెబుతున్నారు.