తెలంగాణ పంచాయతీల అపాయింట్ డే ఖరారు

తెలంగాణలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల అపాయింట్ డేను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. అదే రోజున పాలకమండళ్ల ప్రమాణస్వీకారం కూడా జరగనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 2 శనివారం రోజున అపాయింట్ డేగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు తొలి పాలకమండలి సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అపాయింట్ డే నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణలో 12 వేల పైగా ఉన్న గ్రామాల్లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. సుమారు 1 లక్షా 10 వేల వార్డులకు ఎన్నికలు జరిగాయి. 1 కోటి 50 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు.

గ్రామాలలో అభివృద్ది సాధించినప్పుడే దేశం అభివృద్ది చెందుతుందని సీఎం కేసీఆర్ గతంలో అన్నారు. గత ఆరు నెలల నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలు నడుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఇక ఆలస్యం చేయకుండా కొత్త పాలకమండళ్లు బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

గ్రామాలల్లో ప్రస్తుతం అభివృద్ది కుంటు పడడంతో దానికి దిద్దుబాటు చర్యలు ప్రభుత్వం చేపట్టింది. అందుకే ఇక ఆలస్యం చేయకుండా పాలకమండలి వెంటనే ఏర్పాడాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీలలో ఏర్పాట్లు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు అందజేసినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 2 వ తేదినే అన్ని గ్రామ పంచాయతీలలో తెలంగాణ వ్యాప్తంగా కొత్త పాలకమండళ్లు కొలువుతీరనున్నాయి.