సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయ నాయకుల గూళ్ల మార్పులు ఊపందుకున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపారు. జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల్లోకి చేరికలు జరుగుతున్నా… టీడీపీ మాత్రం కఠినమైన నియమాలను అమలు చేయాలని నిర్ణయించుకున్నది. పార్టీకి బలమైన స్థిరత్వం తీసుకురావాలన్న లక్ష్యంతో ఎవరైనా సరే ఇకపై టీడీపీలో చేరాలంటే రూల్స్ ఫాలో అవ్వాల్సిందే.
ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక స్పష్టమైన ప్రకటన ద్వారా ఈ కొత్త విధానాన్ని ప్రకటించారు. ఈ ప్రకారం ఇక నుంచి ఎవరు పార్టీలో చేరాలని కోరుకుంటే, ముందుగా వారి వివరాలు టీడీపీ మంగళగిరి కేంద్ర కార్యాలయానికి పంపాలి. ఆ తర్వాత ఆ నేత వివరాలను జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సమగ్రంగా పరిశీలించి, వారి ప్రవేశానికి ఆమోదముద్ర వేయాలా వద్దా అన్నది పార్టీ కేంద్రం నిర్ణయిస్తుంది. దీంతో ఎవరైనా తలుచుకుంటే వెంటనే టీడీపీలోకి వెళ్లే రోజులకి పుల్ స్టాప్ పడినట్లే.
ఇంతవరకు టీడీపీకి వచ్చేందుకు మాదిరి స్థాయిలో పేరు ఉన్నా చాలు, వెంటనే పార్టీలోకి ఆహ్వానించేవారు. ఇది కొన్నిసార్లు స్థానిక నేతలకు విఘాతం కలిగించి, అసంతృప్తి కలిగించేదే. ఈ కారణంగా కొంతమంది నాయకులు పార్టీకి దూరమయ్యారు కూడా. ఈ తరహా ఘటనలు మళ్లీ జరగకుండా చూసేందుకు టీడీపీ అధిష్ఠానం ముందస్తు చర్యలు తీసుకుంటోంది.
ఈ నిర్ణయానికి నమ్మకమైన నాయకుల నుంచి స్పందన ఆశాజనకంగా ఉంది. ముఖ్యంగా బండారు అప్పలనాయుడు లాంటి యువనాయకులు ఈ మార్పును స్వాగతిస్తున్నారు. పార్టీకి అంకితమైనవారికి ఇది ఒక గౌరవ సూచకమైన దిశగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే, టీడీపీ కొత్త దశలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఇకపై అది “తగ్గేదే లే” అనే నిబద్ధతతో ముందుకెళ్లాలని సంకేతాలిస్తోంది.