తెలంగాణలో నిర్వహించనున్న పంచాయతీ కార్యదర్శుల పరీక్ష తేదిని అక్టోబర్ 4వ తేదిన జరపకుండా వాయిదా వేయాలని ఓయూ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు విద్యార్దులు, నిరుద్యోగులు భారీ ర్యాలీ తీశారు. రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో చేశారు.
అక్టోబర్ 4 వ తేదిన గురుకుల పిజిటి పరీక్ష, ఆర్ ఆర్ బీ, ఇతర కేంద్ర పరీక్షలు ఉన్నందున అన్నింటికి అప్లై చేసిన అభ్యర్దులు ఏ పరీక్ష రాయాలో తెలియక ఆవేదన చెందుతున్నారని నిరుద్యోగ జెఏసీ చైర్మన్ మానవతారాయ్ అన్నారు. నిరుద్యోగుల ఆవేదనను పరిగణలోకి తీసుకొని ఆపద్దర్మ ముఖ్యమంత్రి పరీక్ష తేదిని మరో రోజుకు మార్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పరీక్ష నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సాధారణంగా పరీక్ష నిర్వహణకు 45 రోజుల సమయం ఉంటుందని కానీ అవేమి పాటించకుండా కేవలం 28 రోజుల్లోనే పరీక్ష నిర్వహించడం సమంజసం కాదన్నారు. పంచాయతీ కార్యదర్శుల అప్లికేషన్ల ప్రక్రియలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయని అభ్యర్ధులకు చుక్కులు అవుపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్లికేషన్ల గడువును మరింత పెంచి పరీక్ష తేదిని అక్టోబర్ 4 వ తేదిన కాకుండా 45 రోజుల గడువు ప్రకారం పరీక్షను మరో రోజు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనిచో ప్రత్యేక ఉద్యమం తప్పదని మానవతా రాయ్ , నిరుద్యోగులు, ఓయూ విద్యార్దులు హెచ్చరించారు.
పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు సెప్టెంబర్ 3 వతేదిన ప్రారంభమైన అప్లికేషన్ల్ ప్రక్రియలో నిత్యం సర్వర్ బిజీ, ఎర్రర్ సమస్యలతో ఇబ్బందులు ఎదురయ్యాయి. డబ్బులు పే చేస్తే ఫీజు కట్ అయినట్టు చూపించి తర్వాత పే కానట్టు వచ్చింది. దీంతో అభ్యర్దులు రెండు మూడు సార్లు ఫీజు పే చేసి అప్లికేషన్ ప్రాసెస్ చేశారు. దీంతో కట్ అయిన డబ్బులు వస్తాయో రావో తెలియని పరిస్థితి ఏర్పడింది. పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్ తేదిని ముందుగా సెప్టెంబర్ 28 అని ఆ తర్వాత అక్టోబర్ 4గా ప్రకటించారు. నిబంధనల ప్రకారం పరీక్ష తేదిని ప్రకటించాలని ఓయూ జెఏసీ డిమాండ్ చేసింది. అపద్దర్మ ప్రభుత్వం స్పందించకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు.
అక్టోబర్ 4 వ తేదిన ఏ పరీక్షలు ఉన్నాయో చూసుకోకుండా గుడ్డిగా పరీక్షల తేదిని ప్రకటించారని కనీస అవగాహన లేకుండా పరీక్షలు నిర్వహించి అభ్యర్దులను చిక్కుల్లో నెడుతున్నారన్నారు. అవసరమైతే పరీక్ష నిర్వహించే జెఎన్టీయూని కూడా ముట్టడిస్తామన్నారు.