జనసేన ముందున్నది ఆ ఒక్క ఆప్షన్ మాత్రమే.!

ఫక్తు రాజకీయం చేయడానికి జనసేన పార్టీ ఆవిర్భవించలేదు. మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతుంటారు. ఓటమి తనను బాధించదనీ ఆయన అంటుంటారు. అలాంటప్పుడు, గెలవడం కోసం తెలుగుదేశం పార్టీతోనో, భారతీయ జనతా పార్టీతోనో పొత్తు పెట్టుకోవడం దేనికి..?

జనసేన పార్టీ ముందు మూడు ఆప్షన్లు వున్నాయంటూ జనసేన అధినేత తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలే సృష్టించాయి. ‘ప్రకంపనలు’ అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, టీడీపీతోపాటు అధికార వైసీపీ కూడా జనసేనాని ప్రకటనలతో ఉలిక్కపడింది.

జనసేన మీద టీడీపీ నేతల విమర్శలు వాటిని చూస్తూ వైసీపీ హంగామా చేయడం.. ఇవన్నీ రాజకీయంగా ఉలిక్కిపడే వ్యవహారాలే. జనసేన పార్టీకి 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, సీట్లను (ఒకే ఒక్కటి) పరిగణనలోకి తీసుకుంటే, అసలు జనసేన పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరమే టీడీపీకిగానీ, వైసీపీకిగానీ లేదు.

ఇక, జనసేన కూడా, 2019 ఎన్నికలతో పోల్చితే కొత్తగా తమకు వచ్చే ఎన్నికలతో నష్టమేమీ వుండదని ఈపాటికే అర్థం చేసుకుని వుండాలి. 2019 ఎన్నికల్లో వచ్చిన ఆ ఒక్క సీటు కూడా 2024 ఎన్నికల్లో రాదని జనసేనాని బెంగపడుతున్నారని అనుకోలేం. అలాంటప్పుడు, టీడీపీతో కలిసి వెళ్ళడమో.. బీజేపీతో కలిసి వెళ్ళడమో ఎందుకు.? అసలు ఆ రెండు ఆప్షన్లూ అర్థం లేనివే.

జనసేన అధినేత గనుక సోలోగా ఎన్నికల్ని ఫేస్ చేస్తే ఖచ్చితంగా ఉపయోగం వుంటుంది. ఎందుకంటే, జనసేన పార్టీని 2019 ఎన్నికల్లో బీఎస్పీనే దారుణంగా దెబ్బ తీసింది. వయసులో పెద్దవారైనాగానీ, రాష్ట్రంతో సంబంధం లేని బీఎస్పీ అధినేత్రికి పవన్ పాదాభివందనం చేయడం.. అప్పట్లో జనసైనికులూ జీర్ణించుకోలేకపోయారు. వామపక్షాల అతి కూడా జనసేన కొంప ముంచింది.

సో, ఎలా చూసినా జనసేనాని ముందు వున్నది ఒకే ఒక్క ఆప్షన్. అదే సోలో ఫైట్.!