ఇది క్లియర్: ఏకైక రాజధాని విశాఖపట్నం మాత్రమే.!

మాటల్లేవ్.! మాట్లాడుకోడాల్లేవ్.! మూడు రాజధానులు హంబక్. ఏకైక రాజధాని విశాఖపట్నం మాత్రమే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదే విషయాన్ని ఇటీవల కుండబద్దలుగొట్టేశారు. ‘నేనూ విశాఖకు వచ్చేస్తున్నా..’ అంటూ ఏకంగా ఢిల్లీలోనే, అందునా గ్లోబల్ సమ్మిట్ సన్నాహక సమావేశంలో వ్యాఖ్యానించేశారు.

ముఖ్యమంత్రి అలా వ్యాఖ్యానించాక, ఆర్థిక మంత్రి నుంచి అందుకు భిన్నంగా ఎలాంటి వ్యాఖ్యలైనా ఎందుకొస్తాయి.? కర్నూలు న్యాయ రాజధాని అన్నది ఉత్త మాట. వుండేది ఒకే ఒక్క రాజధాని.. అదే విశాఖపట్నం. కర్నూలులో హైకోర్టు మెయిన్ బెంచ్ వుంటుందంతే.. అని సెలవిచ్చారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.

అంటే, అమరావతిలో కూడా హైకోర్టు వుంటుందన్నమాట. అక్కడ శాసన కార్యకలాపాలు జరుగుతాయా.? లేదా.? ఈ విషయమై బుగ్గన స్పందించలేదు.. ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. అసలు అమరావతి ప్రస్తావనే తీసుకురాలేదు. బెంగళూరులో బుగ్గన చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాయలసీమ ఉలిక్కిపడింది. కర్నూలులో న్యాయ రాజధాని వస్తుందంటూ గత కొంతకాలంగా వైసీపీ చెబుతోంది. మూడు రాజధానుల చట్టం చెబుతున్నదీ ఇదే. ఆ చట్టాన్ని ఎప్పుడో వైసీపీ చెత్త బుట్టలో వేసేసిందనుకోండి.. అది వేరే సంగతి.

ఒక్కటి మాత్రం నిజం. విశాఖకు రాజధాని అయ్యే అన్ని అర్హతలూ వున్నాయి. కానీ, అమరావతిని ఏం చేస్తారు.? రాజధానిగా నోటిఫై అయిన అమరావతి నుంచి, రాజధాని వ్యవహారాల్ని విశాఖకు వైసీపీ సర్కారు ఎలా తరలిస్తుంది.? ఏమో, వేచి చూడాల్సిందే.