గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకి సంబంధించిన సన్నాహక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ కార్యక్రమం వేదికగా పెట్టుబడిదారులకు స్పష్టమైన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నం.. అంటూ ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నినదించడం గమనార్హం.
‘నేను కూడా త్వరలో విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నాను.. పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రండి..’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టుబడిదారుల్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం రాజధానికి సంబంధించి పలు కేసులు కోర్టుల్లో విచారణ దశలో వున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల విషయమై గతంలో చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది వైఎస్ జగన్ సర్కారు. వైసీపీ సర్కారు ఆలోచన ప్రకారమైతే రాష్ట్రానికి మూడు రాజధానులు. కానీ, న్యాయపరమైన వివాదాలతో అది కుదరడంలేదు.
ఆ మూడు రాజధానుల్లో ఒకటైన అమరావతి ప్రస్తుతానికి రాష్ట్రానికి అసలు సిసలు రాజధాని. విశాఖపట్నం, కర్నూలు ప్రతిపాదిత రాజధానులు. ఒకటేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. ఇంకోటి జ్యుడీషియల్ క్యాపిటల్. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని మార్పు విషయమై చట్టం చేయకుండా కొత్త రాజధానిని ప్రకటించడానికి వీల్లేదు.
మరెలా వైఎస్ జగన్, ‘నేనూ విశాఖకు వెళుతున్నా..’ అంటూ రాజధానిగా విశాఖపట్నం పేరుని ప్రతిపాదించినట్లు.? ఏమోగానీ, ఈ ప్రకటనతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ రచ్చ మొదలయ్యే అవకాశాల్లేకపోలేదు. ఈ రాజధాని ప్రకటన, విశాఖలో మార్చి నెలలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుపై ప్రభావం చూపుతుందా.? వేచి చూడాల్సిందే.