తొమ్మిది నెలల్లో నేనే సీఎం.! చంద్రబాబు ధీమా వెనుక.!

తొమ్మిదంటే తొమ్మిది నెలలే.! నేనే అధికారంలోకి వచ్చేస్తున్నా.! అమరావతి ఎక్కడికీ పోదు. అధికారంలోకి రాగానే, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేపడతా.!

ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిగారి మాటలే.! ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు, తన హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అప్పటి అసెంబ్లీ ఈ మేరకు తీర్మానం చేసింది కూడా.

అయితే, అమరావతి పేరుతో చంద్రబాబు ‘తాత్కాలిక’ వ్యవహారాలు చక్కబెట్టారు. తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు.. ఇలా అన్నీ తాత్కాలికమే. అవి శాశ్వత భవనాలే అయినా, వాటికి ‘తాత్కాలిక’ అని పేర్లు పెట్టారు.

ఇంకోపక్క, శాశ్వత నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు.. ఇంతలోనే అధికారం చేజారిపోయింది. అప్పటినుంచి ఇప్పటిదాకా అమరావతిలో, రాజధాని పేరుతో జరిగిన అభివృద్ధి శూన్యం.

అమరావతిలో శాసన కార్యకలాపాలకు పరిమితం చేసేసి, పూర్తిస్థాయి పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించాలనుకుంది వైసీపీ సర్కారు. కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ అన్నారు. కానీ, ఆ ఆశలు నెరవేరలేదు.

ఇంతకీ, చంద్రబాబు తొమ్మది నెలల్లో అధికారంలోకి వస్తారా.? ‘కౌరవ సభకి వెళ్ళను.. గౌరవ సభలో ముఖ్యమంత్రిగా అడుగు పెడతా’నని చంద్రబాబు గతంలో చేసిన శపథం నెరవేరుతుందా.?

ఏమోగానీ, చంద్రబాబు ధీమా చూస్తోంటే.. ఆయనకు ఇటీవలి ఢిల్లీ పర్యటన అనంతరం ఏదో పెద్ద భరోసా లభించినట్లే కనిపిస్తోంది.