వైసీపీలో మరో వికెట్ డౌన్.! నిజమేనా.?

మాజీ మంత్రి పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. ఆయన ఇప్పటికే రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ని ప్రకటించేసిన సంగతి తెలిసిందే. ఇంకోపక్క, మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వుండాలని భావిస్తున్నారట. మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా వృద్ధాప్యం కారణంగా, ప్రత్యక్ష రాజకీయాల విషయమై ఒకింత అయిష్టంగానే వున్నారు.

చెప్పుకుంటూ పోతే, వైసీపీలో దాదాపు డజను మంది వరకు ముఖ్య నేతలిలా, రిటైర్మెంట్ దిశగా వైసీసీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమాచారం అందించేశారు. కానీ, ‘ఈసారికి రిటైర్మెంట్ వద్దు..’ అని వైఎస్ జగన్, వారందరినీ వారిస్తున్నారు.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి సుముఖంగా లేరట. ఆయన కూడా తన వారసుడ్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్నారు.

రాజ్యసభకు తనను పంపాలని ఈ మధ్య ముఖ్యమంత్రి మీద ధర్మాన ఒత్తిడి తీసుకురావడం ఎక్కువైందట. రాజ్యసభ కాదుగానీ, లోక్ సభకు అయినా పోటీ చెయ్యాలని వైఎస్ జగన్, ధర్మానకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

శ్రీకాకుళంలో ధర్మాన గురించి, వైసీపీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ చూస్తోంటే, ఆయన ‘కాడి’ వదిలేసినట్లే అనుకోవాలేమో.! ‘ఈసారి వైసీపీ గెలవడం కష్టం..’ అని పార్టీ శ్రేణుల్లో స్వయంగా ధర్మాన ప్రసాదరావే అనుమానపు బీజాలు నాటారంటూ ప్రచారం జరుగుతోంది.

కాదు కాదు, ఇదంతా విపక్షాల దుష్ప్రచారం అంటోంది ధర్మాన వర్గం. వచ్చే ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు పోటీ చేస్తారనీ, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకీ తావు లేదన్నది ధర్మాన సన్నహితుల వాదన. నిప్పు లేకుండా పొగ పుట్టుకొస్తుందా.?