కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తమ పార్టీ ప్రజా ప్రతినిథులు జనం దగ్గరకి వెళ్ళడం కోసం.!
స్టిక్కర్లు అంటించారు.. గడప గడపకీ వెళ్ళారు.. అయినా సరిపోలేదు.! సరిపోదు కూడా.! ఎందుకంటే, రాజకీయం అంటే అదొక నిరంతర ప్రక్రియ.! ఏడాదిలోపే ఎన్నికలు జరుగుతాయ్. ఈ నేపథ్యంలో, ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదు.
సంక్షేమ పథకాలతో దూసుకెళుతున్నామన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాదన. ‘మేం మంచి చేస్తున్నాం. మాకు ఓట్లెందుకు వెయ్యరు జనం.? ఏదన్నా అసంతృప్తి వుంటే, ఈ కార్యక్రమాలతో తెలిసిపోతుంది. లోపాల్ని సరిదిద్దుకోవడానికి అవకాశం వుంటుంది..’ అని పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథులకు, ముఖ్య నేతలకు జగన్ క్లాసులు తీసుకుంటున్నారు.
గడప గడపకీ మన ప్రభుత్వం.. కార్యక్రమంలో జనం, చీపుళ్ళతో కొందరు వైసీపీ నేతల్ని తరిమికొట్టారన్నది బహిరంగ రహస్యం. స్టిక్కర్లనైతే నిర్మొహమాటంగా పీకేశారు. రాజకీయాలన్నాక ఇవన్నీ మామూలే. ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులు ఇలాంటివి చేసే అవకాశం వుంది.
కొత్తగా ఇంకో కార్యక్రమం.. జగనన్న సురక్ష.. అన్నట్టుగా పేరు పెట్టారు. ఇది కూడా పై రెండు కార్యక్రమాల్లాంటిదే. పదే పదే జనం వద్దకు వైసీపీ నేతలు వెళుతోంటే, జనానికీ మొహం మొత్తేస్తుందన్న వాదనా లేకపోలేదు.
సంక్షేమ పథకాలు అందున్నా, అభివృద్ధి ఊసు లేదు. ఆ విషయమై నిలదీతలు తప్పడంలేదు. ఆ నిలదీతల్ని ప్రజా ప్రతినిథులు భరించలేకపోతున్నారు.