కేంద్రం సూచనలతో మరోసారి దిశ బిల్లు

ap assembly

 

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని , తీసుకొచ్చిన దిశ బిల్లును మరోసారి అసెంబ్లీ ముందుకు తీసుకురాబోతుంది. ఏడాది క్రితం చట్టం చేసి కేంద్రానికి పంపినా, కేంద్రం ఆమోదం లభించలేదు. ఈ బిల్లులో రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయని చెబుతూ చట్టాన్ని కేంద్రం వెనక్కి పంపింది.

తెలంగాణలో దిశ ఘటన జరిగిన తర్వాత ఏపీలో హుటాహుటిన బిల్లు ఆమోదించేసి, ఢిల్లీకి పంపిన ఏపీ సర్కార్, ఆ బిల్లును కేంద్రం ఆమోదం పొందకుండానే అమలు చేయడం ప్రారంభించారు. దిశ పోలీస్ స్టేషన్లు కూడా పెట్టారు. కానీ, ఆ బిల్లులో అనేక సవరణల సూచిస్తూ కేంద్రం తిరిగి ఏపీకి బిల్లును పంపింది.

దిశ చట్టం ప్రకారం అత్యాచారం చేస్తే 21 రోజుల్లో ఉరి శిక్ష విధిస్తారు. దీనిపై న్యాయనిపుణులు ఎన్నో సందేహాలు లెవనెత్తారు. అలాగే దేశంలో అమల్లో ఉన్న ఐపీసీ, సీఆర్‌ పీసీ చట్టాలకు అనుగుణంగా లేదనే కారణంతో ఈ బిల్లును కేంద్రం గతంలో తిరస్కరించింది. ముఖ్యంగా 21 రోజుల్లో నిందితులకు ఉరిశిక్ష విధించాలన్న నిబంధన ఐపీసీ చట్టానికి అనుగుణంగా లేకపోవడం దీనికి ప్రధాన కారణమైంది.

దీనితో మళ్లీ ఈ చట్టంలో మార్పులు చేసి ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ఆమోదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం ఏపీలో దిశ చట్టం ప్రస్తుతం అమల్లో ఉన్నప్పటికీ ,శిక్షల విషయంలో మాత్రం చట్టం లేకుండా అమలు సాధ్యం కాదు. దీనితో ఏపీ ప్రభుత్వం మరోసారి సవరణలతో దిశ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడుతోంది. ఈసారి పక్కాగా కేంద్రం సూచించిన మార్పులు చేసి అసెంబ్లీ ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.