ప్రముఖ నటుడు, టిడిపి మాజీ ఎంపి మురళీమోహన్ కు విశాఖపట్నంలో ఉన్న జయభేరి షోరూమ్ ను అధికారులు కూల్చేశారు. ఎంవిపి సెక్టార్ 2లో ఎటువంటి ప్లాన్ లేకుండానే మురళి మోహన్ భారీ షోరూమ్ ను నిర్మించారు. మొన్నటి వరకూ అధికారంలో ఉన్నారు కద ? అడిగే వాళ్ళు లేకుండా పోయారు. దాంతో ఇష్టారాజ్యంగా కార్ల బిజినెస్ కోసం ప్లాన్ సమర్పించకుండానే షెడ్ వేసేసి బిజినెస్ చేసేస్తున్నారు.
అక్రమనిర్మాణలపై జగన్మోహన్ రెడ్డి తాజా ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమనిర్మాణాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే విశాఖపట్నంలో ముగ్గురు ప్రముఖుల భవనాలను గుర్తించారు. మురళిమోహన్ కార్ల వ్యాపారం నిర్వహిస్తున్న భారీ షెడ్డు కూడా ఒకటి.
ఇక జోన్ 1 లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిర్మించిన క్యాంపు ఆఫీసు భవనం కూడా ఎటువంటి అనుమతులు లేకుండానే కట్టేసినట్లు గుర్తించారు. మంత్రన్న భావనతో క్యాంపాఫీసు నిర్మాణానికి కనీసం గంటా అనుమతులకు కూడా దరఖాస్తు చేసుకోలేదు. దాన్ని కూడా కూల్చేయాలని ఉన్నతాధికారులనుండి ఆదేశాలు వచ్చాయి. అలాగే నగరంలోనే ఉన్న ద్వారకానగర్ లోని అనకాపల్లి మాజీ ఎంఎల్ఏ పీలా గోవింద్ కూడా నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించుకున్నట్లు గుర్తించారు.
అంటే అనుమతుల కోసం పీలా మున్సిపాలిటికి సమర్పించిన ప్లాన్ వేరుగా ఉందట. ప్లాన్ కు అనుమతులు తీసుకున్న తర్వాత నర్మించిన భవనం వేరేగా ఉందట. దాంతో అనుమతులకు విరుద్ధంగా ఉన్న వాటితో పాటు అసలు అనుమతులే లేకుండా కట్టిన వాటినికి కూడా కూలగొట్టేసేందుకు రెడీ అవుతున్నారు.