తెలుగుదేశం పార్టీ అంగరంగ వైభంగా స్వర్గీయ ఎన్టీయార్ శత జయంతి వేడుకల్ని ఓ వైపు, టీడీపీ మహానాడుని ఇంకో వైపు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. స్వర్గీయ ఎన్టీయార్ అంటే, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి.!
అంతటి మహానుభావుడ్ని ఒకే ఒక్క వెన్నుపోటుతో నేలకొరిగేలా చేయగలిగారు ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. ఆ ఎన్టీయార్ నుంచి తెలుగుదేశం పార్టీని లాగేసుకుని, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ ఎన్టీయార్‌ని గెంటేసిన ఘనత చంద్రబాబునాయుడిదే.
ఇప్పుడు ఏ ఎన్టీయార్‌ని టీడీపీ మొక్కుతోందో, అదే ఎన్టీయార్ మీద అప్పట్లో.. ఇదే టీడీపీ చెప్పులేయించింది.! ఇప్పుడేమో శత జయంతి వేడుకలట.. మహానాడు వ్యవహారమట.! ఇంతకీ, ఎవరి అన్నగారి ఆత్మకు గౌరవమెక్కడ.?
స్వర్గీయ ఎన్టీయార్‌కి కోట్లాదిమంది అభిమానులున్నారు. ఆయన పేరు తలవకుండా సినిమా రంగం లేదు. తెలుగునాట రాజకీయ రంగం కూడా లేదన్నది నిర్వివాదాంశం. కానీ, ఆ ఎన్టీయార్ ఆత్మ, తనకు జరిగిన అవమానాలకీ, ఇప్పుడు జరుగుతున్న పబ్లిసిటీ స్టంట్లకీ ఎలా క్షోభిస్తూ వుంటుంది.?
తప్పదు.. రాజకీయమంటేనే అంత.! ఒక్కటి మాత్రం నిజం.. స్వర్గీయ ఎన్టీయార్ శత జయంతి వేడుకల నిర్వహణతో ఆయన ఖ్యాతి మరింత పెరుగుతోంది.