ఎన్టీయార్ అభిమాని బలవన్మరణం.! ఎందుకింత రాజకీయం.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఓ సినీ నటుడి అభిమాని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘శ్యామ్’ అతని పేరు. ‘శ్యామ్ ఎన్టీయార్’గా సోషల్ మీడియాలో, యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులకి సుపరిచితుడు.

ఎన్టీయార్ అభిమానులే కాక, ఇతర హీరోల అభిమానులూ, శ్యామ్ ఎన్టీయార్‌ని అభిమానిస్తాడట. సాధారణంగా హీరోల అభిమానులకు సంబంధించి ఈ తరహా వార్తలు పెద్దగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనిపించవు.

కానీ, శ్యామ్ ఎన్టీయార్ విషయంలో కొంత భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. అభిమానులంతా ఒక్కతాటిపైకి వచ్చారు. శ్యామ్ ఎన్టీయార్ బలవన్మరణానికి పాల్పడలేదనీ, ఆయన్ని ఎవరో చంపేశారని జూనియర్ ఎన్టీయార్ అభిమానులు అనుమానిస్తున్నారు. అతని మరణానికి స్థానిక వైసీపీ నేతలు కారణమన్నది వారి ఆరోపణ.

ఈ క్రమంలో పెద్దయెత్తున సోషల్ మీడియాలో హంగామా నడుస్తోంది. జూనియర్ ఎన్టీయార్ కూడా తన అభిమాని విషయంలో స్పందించక తప్పేలా లేదు. ఈ విషయాన్ని క్యాష్ చేసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్.. ఇద్దరూ శ్యామ్ ఎన్టీయార్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసేశారు.

వైసీపీ నేతలే ఈ మరణానికి కారణమంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలని చంద్రబాబు, లోకేష్.. సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేసేశారు. మరోపక్క, ప్రేమ వ్యవహారం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు.. ఇవన్నీ శ్యామ్ ఎన్టీయార్ మరణానికి కారణం తప్ప, అతని బలవన్మరణానికి వైసీపీకి సంబంధం లేదని వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు అంటున్నారు.

ఓ సినీ నటుడి అభిమాని మరణం.. ఇంతటి రాజకీయ దుమారానికి కారణమవుతుండడం ఆశ్చర్యకరమే.