ఒక్క సీటు కూడా.! ఎలా పవన్ కళ్యాణ్.? ఎలా.?

వైసీపీకి ఒక్క సీటు కూడా ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే ఎన్నికల్లో రానివ్వను.. అంటూ పదే పదే ఒకే మాట చెబుతూ వస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.! ఏమో, 2024 ఎన్నికల్లో వైసీపీకి దారుణమైన దెబ్బ రాజకీయంగా తగులుతుందేమో.! రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.

కానీ, 2019 ఎన్నికల్లో మొత్తంగా 151 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచిన వైసీపీ, ఉభయ గోదావరి జిల్లాల్లో వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదా.? వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకుండా.. ఆ బాధ్యతను తాను తీసుకుంటానని జనసేనాని చెప్పడమేంటి.?

‘వైసీపీని ఓడిస్తా..’ అంటున్నారు పవన్ కళ్యాణ్. ఇది ఆయనకు కొత్త కాదు.! వైసీపీని అధికారంలోకి రానివ్వబోనని 2019 ఎన్నికల్లోనూ నినదించారు. ఏం జరిగింది.? జనసేనాని కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకలేకపోయారు. వైసీపీ, 151 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచి, అధికార పీఠమెక్కింది.

ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా, వాస్తవ పరిస్థితుల్ని అవగతం చేసుకుని రాజకీయ ప్రసంగాలు చేయాలి. సవాళ్ళు విసిరేటప్పుడు, తమ స్థాయి ఏంటనే విషయమూ గుర్తెరగాలి. పార్టీలో చోటా మోటా నాయకులు ఏం మాట్లాడినా, అది వేరే సంగతి. అధినేత అలా చేస్తే కుదరదు కదా.?

వైసీపీని ఓడించడం సంగతి దేవుడెరుగు.. ముందైతే, జనసేన పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది.? పోటీ చేసిన సీట్లలో ఎన్నింటిని గెలుస్తుంది.? ఈ విషయమై కనీసం, పార్టీ శ్రేణులకి అయినా, జనసేనాని ఓ భరోసా కల్పించగలగాలి కదా.?

తూర్పుగోదావరి జిల్లా నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోకి వచ్చినా.. జనసేనాని తీరు మారలేదు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నుంచే 2019 ఎన్నికల్లో పోటీ చేసి పరాజయాన్ని చవిచూశారు జనసేనాని. నర్సాపురంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం సందర్భంగా, ‘వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వను’ అని సెలవిచ్చారు జనసేనాని.