మద్య నిషేధంపై యూ టర్న్: మ్యానిఫెస్టోలోనే లేదన్న మంత్రి.!

No Liquor Ban

సరిపోయింది సంబరం.! అసలంటూ మద్య నిషేధాన్ని మేనిఫెస్టోలోనే పెట్టలేదని తేల్చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కావాలంటే, ప్రభుత్వ కార్యాలయాల్లో మా పార్టీ మేనిఫెస్టో వుంటుంది.. దాన్ని చూసుకోండంటూ మీడియా ప్రతినిథులకీ ఝలక్ ఇచ్చారు మంత్రిగారు.

మద్యం ధరలు షాక్ కొట్టేలా పెంచుతామని చెప్పాం తప్ప, మద్య నిషేధం చేస్తామని అనలేదంటూ మంత్రి గుడివాడ స్పష్టం చేసేశారు. సో, మద్య నిషేధంపై వైసీపీ సర్కారు ‘మడమ’ గట్టిగా తిప్పేసిందన్నమాట. ‘జగన్ చెప్పాడంటే, చెయ్యడంతే..’ అంటూ విపక్షాలు విమర్శిస్తున్నదే నిజమయ్యిందిప్పుడు.

ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో మద్యపానంపై తెగ గుస్సా అయిపోయారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆడపడుచుల జీవితాలు నాశనమైపోతున్నాయని, మహిళల తాళి బొట్లు అర్ధాంతరంగా తెగిపోవడానికి కారణం మద్యమేనని వైఎస్ జగన్ వాపోయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే సంపూర్ణంగా మద్య నిషేధం చేసేస్తామన్నారు. తొలుత దశలవారీగా మద్య నియంత్రణ, ఆ తర్వాత పూర్తిగా మద్య నిషేధం.. ఇదంతా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదేళ్ళలోనే చేసేస్తామని వైఎస్ జగన్ చెప్పిన సంగతి తెలిసిందే.

వైసీపీ మేనిఫెస్టోలోనూ మద్య నిషేధం వుంది. కానీ, మంత్రిగారేమో.. అబ్బే, అలాంటిదేమీ లేదంటున్నారు. ఇకనేం, సోషల్ మీడియాలో నెటిజనం వైసీపీని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డినీ ఓ ఆట ఆడేసుకుంటున్నారు. పార్టీని తిట్టించడం, ముఖ్యమంత్రిని తిట్టించడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు వైసీపీ ముఖ్య నేతలు.?