25 కాదు, 18 మాత్రమే.! జనసేనాని తేల్చేశారంతే.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అప్పుడప్పుడూ వాస్తవ ప్రపంచంలోకి వస్తుంటారు. తరచూ అవాస్తవిక ప్రపంచంలో సంచరిస్తుంటారాయన. అధికారంలోకి వచ్చేది తామేనంటారు.. అంతలోనే, ఏదో అలా అంటాంగానీ.. అన్ని సీట్లు రావాలి కదా.. అని వాస్తవాలు ఒప్పేసుకుంటుంటారు.

అసలు విషయమేంటంటే, జనసేన పార్టీ ఓటు బ్యాంకు విషయమై కాస్తంత స్పష్టత ఇచ్చారు జనసేన అధినేత. ప్రస్తుతానికైతే 18 శాతం ఓటు బ్యాంకు వుందంటూ జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ఈ ఓటు బ్యాంకు పెరగబోతోంది. ఖచ్చితంగా పెరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ స్థానాల్ని గెలుస్తాం..’ అంటూ జనసేన నేతలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో జనసేనాని స్పష్టతనిచ్చేశారు. అదేంటీ, మన ఓటు బ్యాంకు 25 నుంచి 35 వరకూ అనుకుంటున్నాం కదా.? అని కొందరు జనసేన నేతలు గుస్సా అయ్యారు.

చాలా సర్వేలు జనసేన ఓటు బ్యాంకు 18 నుంచి 25 శాతం వరకూ వచ్చే ఎన్నికల్లో నమోదవ్వచ్చునని అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే. ఆ లెక్కలైనా జనసేనాని చెప్పి వుండాల్సింది. ఎందుకు అలా చెప్పలేదబ్బా.? అని జనసైనికుల్లోనూ చర్చ జరుగుతోంది.

ఇదిలా వుంటే, వారాహి యాత్ర తర్వాత జరిగే సర్వేలు, వాటి ఫలితాల ఆధారంగా టీడీపీ – జనసేన మధ్య సీట్ల పంపకాలపై స్పష్టత రాబోతోందిట. ఈ విషయమై జనసేన ముఖ్య నేతలు కొందరు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలకు క్లారిటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.