తెలుగు రాష్ట్రాల్లో “డీఎస్సీ” తుస్సే

డిఎస్సీల ప్రకటన పేరుతో ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్బాటాలుగా డిఎస్సీ వేస్తున్నామని ప్రకటనలు చేసినా అమలు పరచటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని నిరుద్యోగులు అంటున్నారు. డిఎస్సీ కోసం ఎదురుచూస్తున్న తమకు నిరాశే ఎదురవుతుందని వారు వాపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేయటంలో జాప్యం ప్రదర్శిస్తుందని పలువురు అంటున్నారు. ఎన్నికల తాయిలంగా నవంబర్ లేదా డిసెంబర్ లో నోటిఫికేషన్ రానున్నట్టుగా తెలుస్తోంది. డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు పలు చిక్కులు అడ్డుగా వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఎస్జీటి పోస్టులకు బీఈడీ వారు అర్హులు అంటూ జూలై 2న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో వివాదం తలెత్తింది. ఇచ్చిన పోస్టులకు ఆర్ధిక శాఖ అనుమతి లభించకపోవడంతో మొత్తం డిఎస్సీ ప్రక్రియనే స్థంభించింది.

ఇటీవల ఏపీ కేభినేట్ సమావేశమై విద్యాశాఖలో 9000 పోస్టులకు అనుమతినిస్తూ ఆమోద ముద్ర వేశారు. దీంతో డిఎస్సీ అభ్యర్ధుల్లో ఆశలు చిగురించాయి. కానీ ఇప్పటి వరకు నియామకానికి సంబంధించిన ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు. జూలైన 6న డిఎస్సీ ప్రకటిస్తామని గంటా ప్రకటించారు. కానీ దానికి సంబందించి ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదని నిరుద్యోగులు అంటున్నారు.

వీటన్నింటికి తోడు డీఈడీ, బీఈడీ వివాదం తలెత్తింది.ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు టెట్ పరీక్షలను నిర్వహించింది. డిఎస్సీలో మరికొంత మందికి అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొంత మందికి అవకాశం కల్పించాలంటే మరో సారీ టెట్ పరీక్ష నిర్వహించాలి. ఎస్జీటి పోస్టులకు బీఈడీ అర్హత పెట్టడంతో మరో సారీ టెట్ పరీక్ష పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది.

టెట్ పరీక్ష పెట్టి డిఎస్సీ నిర్వహిస్తే ఖాళీల వివరాలన్ని మారి పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం జూలైలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుందన్న సమాచారంతో నిరుద్యోగ అభ్యర్ధులంతా కోచింగ్ సెంటర్లలో చేరి కోచింగ్ తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో మంచి కోచింగ్ సెంటర్లు ఉంటాయని భావించి వారంతా ఇక్కడికి వచ్చి కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా అన్నింటిని వదిలేసి  చదువు మీదే వారు నిమగ్నమయ్యారు. నోటిఫికేషన్ రాకపోవడంతో ఫీజులు పెరిగి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రైవేటు కోచింగ్ సెంటర్లతో కుమ్మక్కై కమీషన్లు తీసుకొని కావాలనే కాల యాపన చేస్తుందని విద్యావేత్తలు మండిపడుతున్నారు.

అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా డీఎస్సీ అభ్యర్థుల పరిస్థితి తయారైంది. తెలంగాణలో కూడా డీఎస్సీ ప్రకటనను విడుదల చేసి ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఊసే సర్కార్ ఎత్తలేదు. ఉపాధ్యాయుల బదీలీలతో చాలా పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. విద్యావాలంటీర్ల నియామకం చేపట్టి పాఠాలు చెప్పిస్తుంది కానీ రెగ్యూలర్ నియామక టీచర్లను మాత్రం భర్తీ చేయటంలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు చేపట్టాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.