టీడీపీ అధినేత చంద్రబాబు.. అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేశారు. ఇందులో భాగంగా 9 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానాలను అభ్యర్థులను ప్రకటించారు. దీంతో… కూటమిలో భాగంగా చంద్రబాబు మిగుల్చుకున్న 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలు అన్నింటికీ అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది. ఇలా చంద్రబాబు తాజాగా ప్రకటించిన జాబితాలో అత్యంత ఆసక్తిగా మారిన భీమిలి – చీపురుపల్లి నియోజకవర్గాలపై స్పష్టత వచ్చింది.
అవును… టీడీపీలో అత్యంత ఆసక్తిగా మారిన చీపురుపల్లి – భీమిలీ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా… మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావుకు భీమిలి టిక్కెట్ కన్ ఫాం చేశారు. ఇదే సమయంలో గంటాను వెళ్లమని పట్టుబట్టినట్లు చెబుతున్న చీపురుపల్లిని కిమిడి కళా వెంకట్రావుకు కేటాయించారు. దీంతో… కోరి తెచ్చుకున్న భీమిలిలో గంటా ముందున్న సమస్యలపై ఇప్పుడు చర్చ మొదలైంది.
భీమిలి టిక్కెట్ కన్ ఫాం అవ్వడంతోనే గంటా గెలిచినంతగా సంబరాలు చేస్తున్నారు ఆయన అనుచరులు. పైగా… కూటమి అధికారంలోకి వస్తే ఆయన మరోసారి మంత్రి అవ్వడం ఖాయమని కూడా జోస్యం చెప్పేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంటే… 2014 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేశారు గంటా శ్రీనివాస రావు. ఆ ఎన్నికల్లో 37,226 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో భీమిలివైపు చూడలేదు! ఈసారి విశాఖ నార్త్ అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 1,944 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో మరోసారి ఆ టిక్కెట్ నుంచి పోటీ చేసే ఆలోచన చేయలేదు గంటా శ్రీనివాస రావు. అసలు 2014 ఎన్నికల్లో అంత మెజారిటీ ఇచ్చిన భీమిలి నుంచి 2019లో ఎందుకు తప్పుకున్నారనే విషయంపై చాలా చర్చే నడిచింది.
కట్ చేస్తే… 2024లో మరోసారి భీమిలిని ఎంచుకున్నారు గంట. అందుకు బాబు కూడా “సరే”అనక తప్పలేదు! దీంతో… భీమిలిలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ని ఢీ కొట్టబోతున్నారు గంటా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… భీమిలిలో ఓటమి ఎరుగని అవంతి.. మూడేళ్లు మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెబుతున్నారు.
పైగా… ఒకే సీటుని నమ్ముకున్న నేతగా ఆయనకు పేరుంది! కానీ.. గంటా విషయంలో భీమిలి జనాలకు ఆ నమ్మకం లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో… 2014 తర్వాత ఐదేళ్లు మంత్రిగా చేసి భీమిలికి చేసిందేమీ లేదని.. దీంతో 2019లో భీమిలిని వదిలి వెళ్లిపోయారని.. ఇప్పుడు మరోసారి వస్తున్నారనే చర్చ ఆ నియోజకవర్గ ప్రజానికంలో ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆ సంగతి అలా ఉంటే… గంటాకు టిక్కెట్ ఇవ్వడంపై ఆ టిక్కెట్ ఆశించిన టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఇందులో ప్రధానంగా ఒక మాజీ ఎంపీ ఈ టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేశారని చెబుతుండగా.. మరో బీసీ నేత కూడా బలంగా ప్రయత్నించారని అంటున్నారు. దీంతో… రానున్న ఎన్నికల్లో వీరి నుంచి గంటాకు ఎలాంటి మద్దతు దొరకనుందనేది ఆసక్తిగా మారింది.