ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా అనే అంశం ఎంత హాట్ టాపిక్ గా మారిందనేది తెలిసిన విషయమే. ప్రధానంగా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెషన్ కూల్చివేత అనంతరం ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయంలో రాజకీయ నాయకులు పలువురు ప్రెస్ మీట్ లు పెట్టి.. హైడ్రాను అభినందిస్తుంటే.. మరికొంతమంది మాత్రం ముందు కాంగ్రెస్ వాళ్లవి కూల్చి, తర్వాత మిగిలిన వాళ్ల జోలికి రావాలంటూ లాజిక్ లేని కామెంట్లు చేస్తున్నారు!
తెలంగాణ ప్రభుత్వం మాత్రం… హైడ్రా పూర్తిగా రాజకీయాలకు అతీతం అని, పార్టీలతో అస్సలు సంబంధం లేదని, చిన్నా పెద్దా తారతమ్యాలకు తావే లేదని, అక్రమ నిర్మాణాలు అని తెలిస్తే, చెరువులు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలు అని ఫిర్యాదులు అంది అది నిజమని తెలిస్తే ఏదో ఒక రోజు అక్కడ హైడ్రా బుల్డోజర్లు ఎంట్రీ ఇవ్వడం కన్ ఫాం అని నొక్కి చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీలో హైడ్రా రావాల్సిందే అంటున్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత.
అవును.. ఏపీలో కూడా హైడ్రా వస్తుంది అని అంటున్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖ పర్యటనకు వచ్చిన మునిసిపల్ మంత్రి నారాయణతో కలసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విశాఖలో భూ అక్రమణలు జరిగాయని మంత్రి నారాయణ అన్నారు. పార్కులు సైతం దురాక్రమణలు లోను కావడం బాధాకరం అన్నారు. ఈ సమయలో స్పందించిన గంటా… ఏపీలో కూడా హైడ్రా రావాల్సిందే వస్తుంది అని అన్నరు.
దీంతో ఏపీలో హైడ్రా అనే వ్యవహారంపై చర్చ మొదలైంది. ఈ సమయంలో స్పందించిన మంత్రి నారాయాణ… ఏపీలో హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి వస్తుందని అన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… హైడ్రా ఏర్పాటు లక్ష్యం రాజకీయ కక్షలే అయితే అది సత్ఫలితాలు ఇవ్వదు! కేవలం వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికి తీయడానికే హైడ్రా లాంటి వ్యవస్థను వాడాలనుకుంటే అది బెడిసి కొట్టే ప్రమాదం పుష్కలంగా ఉంది!
ఇక విశాఖ విషయానికి వస్తే కేవలం వైసీపీ హయాంలోనే భూ కబ్జాలు జరగలేదు, అంతకు ముందు టీడీపీ హయాంలోనూ ఎక్కువగా జరిగాయని అంటున్నారు. వాస్తవానికి గత రెండు దశాబ్దాలుగా విశాఖ భూములకు భద్రత లేకుండా పోయిందనేది స్థానికులు చెప్పేమాట. ఈ నేపథ్యంలో నిజంగా కూటమి ప్రభుత్వం ఏపీలోనూ హైడ్రాను తీసుకువస్తే అది కచ్చితంగా శుభపరిణామమే. కాకపోతే… ఈ విషయంలో పార్టీలకు అతీతంగా చేసేటంత సిన్సియారిటీ బాబు & కో కి ఉందా అనేది అసలు పాయింట్.
ఇప్పటికే రెడ్ బుక్ అంటూ తిరుగుతున్న టీడీపీ నేతలు.. ఏపీలో హైడ్రా వస్తే దాన్ని ఏ స్థాయిలో వాడతారనేది మరో కీలక అంశం. అన్నింటికంటే ముందు… ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ నుంచి హైడ్రా పనులు మొదలుపెట్టాల్సి వస్తుందేమో అనేది మరో ఆసక్తికర అంశం. మరి… గంటా శ్రీనివాస్ మాట కూటమి పెద్దలు వింటారా.. అందుకు బాబు ఒప్పుకుంటారా.. వేచి చూడాలి!