వారాహికి ఆంధ్రప్రదేశ్‌లో ‘నో ఎంట్రీ’.! మంత్రి మాటలకు అర్థమిదేనా.?

వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రల కోసం వినియోగించనున్న ‘వారాహి’ వాహనంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఈ వాహనానికి రిజిస్ట్రేషన్ పూర్తయిన సంగతి తెలిసిందే.

నిజానికి, తెలంగాణలో రిజిస్ట్రేషన్ పూర్తయి చాలా రోజులే అయ్యింది. కానీ, ఆ తర్వాత నుంచే హైడ్రామా మొదలయ్యింది. దానికి సంబంధించిన టీజర్ వీడియోను జనసేనాని విడుదల చేయడంతో, అందులో కనిపిస్తోన్న వాహన రంగుపై వివాదం చెలరేగింది. ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ దేశంలో ఎక్కడా జరగదని ఏపీ రవాణా శాఖ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తెగేసి చెప్పారు.

ఏపీ రవాణా శాఖకు చెందిన ఓ అధికారి కూడా ఇవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, తెలంగాణలో వాహనానికి రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీయే అధికారులు, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ధృవీకరించారు.

అయినాగానీ, ఏపీలోకి ‘వారాహి’ వాహనాన్ని అనుమతించేది లేదన్నట్లుగానే ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెబుతున్నారు. ‘వాహనానికి తెలంగాణలో రిజిస్ట్రేషన్ జరిగింది. అది ఏపీలోకి రావాలంటే, ఇక్కడి నిబంధనలకు అనుగుణంగా వుండాలి.. విదేశాల్లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్.. ఇక్కడ రైట్ హ్యాండ్ డ్రైవింగ్..’ అంటూ ఏవేవో వ్యాఖ్యలు మీడియా సమావేశంలో చేశారు మంత్రి అమర్నాథ్.

అయితే, దేశవ్యాప్తంగా మోటారు వాహనాల చట్టం ఒకటే. ఓ రాష్ట్రంలో వాహనం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటే, దేశంలో ఎక్కడా ఆ వాహనం తిరగడానికి ఇబ్బందులుండవు. ఈ విషయం కూడా తెలియనంత అయోమయ పరిస్థితుల్లో ఏపీ మంత్రి వున్నారా.? లేదంటే, ‘వారాహి’ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం వద్ద వేరే వ్యూహం ఏదైనా వుందా.? అన్నది తేలాల్సి వుంది.