కోవిడ్ భయాల్లేవ్.! స్కూళ్ళు తెరచుకుంటాయ్.!

దేశంలో కోవిడ్ వైరస్ మళ్ళీ విజృంభించబోతోందా.? అంటే, ఔననే సంకేతాలే కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులగా క్రమక్రమంగా కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గణనీయంగా కొత్త కేసులు పెరుగుతుండడంతో, అందరిలోనూ ఆందోళన నెలకొంటోంది. మొదటి వేవ్, దాన్ని మించిన రెండో వేవ్.. దేశాన్ని అతలాకుతలం చేసింది. మూడో వేవ్ ప్రభావం తక్కువగానే వుంది. మరి, నాలుగో వేవ్ పరిస్థితేంటి.?

ప్రస్తుతానికి రోజువారీ కోవిడ్ కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల లోపే వుంది. కానీ, అనూహ్యంగా ఈ కేసుల సంఖ్య పెరగడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. అదే సమయంలో, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా చాలా వేగంగా జరుగుతోంది. రికార్డు స్థాయిలో ఇప్పటికే వ్యాక్సినేషన్ చేసేశారు. సో, వ్యాక్సినేషన్ తీసుకోనివారి సంఖ్య చాలా చాలా తక్కువగానే వుందన్నమాట. అలాంటప్పుడ, కోవిడ్ పాండమిక్ గురించి భయపడాల్సిన పనేముంది.?

వ్యాక్సిన్ వేరు, వైరస్ వేరు.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇంకా కోవిడ్ మరణాలు సంభవిస్తూనే వున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎంతమంది కోవిడ్ బారిన ప్రాణాలు కోల్పోతున్నారు.? అన్నదానిపై ఖచ్చితమైన సమాచారం వుండడంలేదు. 130 కోట్ల మంది జనాభా వున్న భారతదేశంలో కోవిడ్ గణాంకాలు చిందరవందరగానే కనిపిస్తున్నాయి. అదే అసలు సమస్య.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు చెప్పిన లెక్కలకీ, వాస్తవంగా కోవిడ్ ప్రభావానికీ అస్సలు పొంతన లేని పరిస్థితి. ఇంతటి గందరగోళ పరిస్థితుల నడుమ మళ్ళీ స్కూళ్ళు తెరచుకుంటున్నాయ్. చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవడమే కాదు, రెండు డోసుల వ్యాక్సిన్ కూడా చాలామందికి అయిపోయింది. అయినాగానీ, చిన్న పిల్లలకు ఒకింత సెన్సిటివ్.. ఇలాంటి వైరస్సుల విషయంలో.
అలాగని, విద్యా వ్యవస్థ దెబ్బ తింటే ఎలా.? ఎటూ తేల్చుకోలేని సందర్భమిది. కోవిడ్ కొత్త వేవ్ కూడా మూడో వేవ్ కంటే తక్కువ తీవ్రతతో వెళ్ళిపోతే మంచిదే. లేదంటే మాత్రం.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు.