చిరంజీవి ఇకపై సినిమాలొదిలేసి రాజకీయాల్లోకి వచ్చెయ్యాల్సిందే.!

సినిమా రంగంలోకి తిరిగొచ్చి చిరంజీవి సాధించిందేంటి.? ఓ ‘ఖైదీ నెంబర్ 150’, ఓ ‘వాల్తేరు వీరయ్య’.! అంతేగా.? ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా చేసి, నటుడిగా సరికొత్త సంతృప్తి చెందారాయన.

‘వాల్తేరు వీరయ్య’ సినిమా హిట్టయినాగానీ, ‘ఇలాంటి సినిమాలు చిరంజీవి చేయకపోతేనే మంచిది’ అని అభిమానుల్లోనూ చాలామంది అనుకున్నారు. ‘భోళా శంకర్’లో ఆ ‘అతి’ మరింత ఎక్కువైపోయి, బోల్తా కొట్టేసింది. వాస్తవానికి ‘భోళా శంకర్’ మరీ తీసి కట్టు సినిమా కాదు. కానీ, చిరంజీవి ఇలాంటి సినిమాలు చేయకూడదని అభిమానులే ఫిక్సయిపోవడంతో అంతటి దారుణమైన రిజల్ట్ వచ్చింది.

మరిప్పుడు చిరంజీవి ఏం చేయాలి.? విపరీతమైన నెగెటివిటీని ఎదుర్కొంటున్న చిరంజీవి, సినిమాల్ని కాదని.. మళ్ళీ రాజకీయాల్లోకి వెళితే మంచిదేమో.? జనసేన పార్టీకి చిరంజీవి గౌరవాధ్యక్షుడిగా సేవలందిస్తే బెటరన్నది మెగాభిమానుల్లో ఓ వర్గం భావన.

చిరంజీవి, ఆ పదవిని అధికారికంగా తీసుకున్నా.. తీసుకోకున్నా.. ఆ బాధ్యత అయితే ఆయనకు ఎప్పుడూ వుంటుందనేవారూ లేకపోలేదు. 2024 ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న దరిమిలా, చిరంజీవి.. జనసేన పార్టీకి అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చే అవకాశమైతే లేకపోలేదు.

ఇవన్నీ ఎందుకు, బీజేపీ ఆఫర్ చేస్తున్న రాజ్యసభ సీటు తీసుకోవచ్చు కదా.? అని చిరంజీవికి కొందరు అభిమానులు సూచిస్తున్నారట. సన్నిహితులదీ ఇదే మాట.. అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి సినీ రాజకీయ వర్గాల్లో.

జనసేన వైపు చిరంజీవి చూసినా, ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయకూడదన్నది ఇంకో వర్గం భావన. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారేమోనన్న ఆందోళతోనే, టీడీపీ ‘భోళా శంకర్’ మీద నెగెటివిటీ ప్రచారం చేస్తోందా.? ఏమో, అదీ నిజమే కావొచ్చు.