ఓడిన తర్వాత కూడా టిడిపికి బుద్ధి రాలేదా ?

మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా తెలుగుదేశంపార్టీ నేతలకు బుద్ధి వచ్చినట్లు లేదు. జగన్మోహన్ రెడ్డిపైకి కాపులను రెచ్చగొట్టే పనిలో టిడిపి నేతలు బాగా బిజీగా ఉన్నారు. అధికారానికి రావటానికి, వచ్చిన తర్వాత కూడా చంద్రబాబునాయుడు అబద్ధాలు చెబుతునే ఉన్నారు. అటువంటి అబద్ధాల్లో కాపులను బిసిల్లో చేర్చటం కూడా కీలకమైనదే.

అబద్ధాలు చెప్పారని కాపులు గ్రహించబట్టే మొన్నటి ఎన్నికల్లో కాపుల్లో మెజారిటి సెక్షన్ వైసిపికి మద్దతుగా నిలబడింది. తాము అబద్ధాలు చెప్పి మాయ చేద్దామని అనుకున్నా సాధ్యం కాలేదే అన్న బాధ టిడిపి నేతల్లో స్పష్టంగా కనబడుతోంది. అందుకనే కాపుల నోటికాడ కూడును జగన్ లాగేసుకుంటున్నారంటూ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విష ప్రచారం మొదలుపెట్టారు.

కాపులను బిసిల్లో చేరుస్తామని తప్పుడు హామీనిచ్చి మోసం చేసింది చంద్రబాబన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. అదే జగన్ విషయానికి వస్తే కాపులను బిసిల్లో చేర్చే అంశం కేంద్రప్రభుత్వ పరిధిలోనిదంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. చంద్రబాబు లాగ తప్పుడు హామీలివ్వలేనని కూడా అన్నారు. జగన్ ప్రకటనపై ముందు కాపులకు ఆగ్రహం వచ్చినా తర్వాత వాస్తవం గ్రహించారు. అందుకనే జగన్ కు మద్దతు పలికారు.

ఎప్పుడైతే జగన్ అధికారంలోకి వచ్చారో అప్పటి నుండే చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లో మీడియాలో అసహనం కట్టలు తెంచుకున్నది. ఎలాగైనా సరే జనాలను జగన్ పైకి రెచ్చగొట్టాలనే ప్లాన్ అమలు ప్రయత్నం మొదలుపెట్టింది. జగన్ ఇవ్వని హామీలను ఇచ్చారంటూ ప్రచారం చేస్తోంది. ఏపిని తెలంగాణాకు తాకట్టు పెట్టేస్తున్నారని, కాపులను రెచ్చ గొడుతున్నారు. వీళ్ళేం చేసినా జనాలైతే నమ్మటం లేదు. మొత్తం మీద జనాలు ఛీ కొట్టినా టిడిపికి బుద్ధి రాలేదని అర్ధమైపోతోంది.