ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పప్పులుడకవ్.! కండిషన్స్ అప్లయ్.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ అడుగు పెట్టేసింది. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడ్ని ఇప్పటికే ప్రకటించేశారు తెలంగాణ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఇంతకీ, బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడెవరట.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. తెలంగాణలో బీఆర్ఎస్‌కి అధ్యక్షుడు లేడుగానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి అధ్యక్షుడా.? అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వెటకారం కూడా చేసేశారు కేసీయార్ మీద.

ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ అనుకూల ఫ్లెక్సీలు ఏర్పాటవుతున్నాయి. దాంతో, బీఆర్ఎస్ వ్యతిరేక బ్యానర్లు కూడా మొదలవుతున్నాయి. గతంలో ఆంధ్రోళ్ళని ఉద్దేశించి కేసీయార్ చేసిన వ్యాఖ్యల్ని ఈ బ్యానర్లలో ఏర్పాటు చేస్తున్నారు.

అయితే, బీఆర్ఎస్ రాజకీయం వల్ల కేసీయార్‌కి ఎక్కడ లాభం.? ఎక్కడ నష్టం.? ఏపీలో పది ఓట్లు వచ్చినా, అది బీజేపీకి లాభమే. తెలంగాణలో మాత్రం ఐదు ఓట్లు కూడా పోకూడదు.! ఏపీలో కేసీయార్‌ని ఎంతలా ఎవరైనా తిడితే, అది తెలంగాణలో ఆయనకు అంత అడ్వాంటేజ్ అవుతుంది.

ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ సానుభూతిపరులే కొందరు కేసీయార్ వ్యతిరేక ఫ్లెక్సీలను ఏపీలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసీయార్ మార్కు రాజకీయాలివి. ఈ రాజకీయాల పట్ల ఏపీలోని రాజకీయ పార్టీలూ అప్రమత్తమవుతున్నాయి.

బీఆర్ఎస్ నిమిత్తం కర్నాటక, బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని ముఖ్య నాయకులతో తొలుత సంప్రదింపులు జరిపిన కేసీయార్, అనూహ్యంగా ఏపీలో తమ పార్టీ తొలి రాష్ట్ర అధ్యక్షుడ్ని ప్రకటించారు. కేసీయార్ వ్యూహాలు ఇలాగే వుంటాయ్ మరి.