పవ‌న్‌కు మనుషులు కావలెను 

Janasena
పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ధీనస్థితి మరోసారి బయటపడుతోంది.  త్వరలో ఆంధ్రాలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి.  ఈ ఎన్నికల్లో జెడ్పిటీసీ, ఎంపీటీసీలుగా పోటీచేయడానికి అభ్యర్థులు వేళా సంఖ్యలో అవసరం అవుతారు.  తెలుగుదేశం, వైకాపాలు అంటే సంస్థాగతంగా వేళ్లూనుకుని ఉన్న పార్టీలు కాబట్టి వాటి మద్దతుతో పోటీచేయడానికి భారీ సంఖ్యలో అభ్యర్థులు  పోటీపడుతుంటారు.  కొన్ని సందర్భాల్లో సర్పంచ్ సీట్ల కోసం పెద్ద పోటీయే నెలకొంటుంది.  పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించి మరీ సీట్లు సంపాదించుకుంటూ ఉంటారు.  రాజకీయ భవిష్యత్తుకు పునాదులు పాడేది ఇక్కడి నుండే కాబట్టి అభ్యర్థులు పెద్ద పార్టీల వైపే ముగ్గుచూపుతూ ఉంటారు. 
 
No candidates for Janasena in Panchayat elections
అలాంటిది జనసేన తరపున పోటీచేయడానికి ఎవరైనా ఆసక్తిచూపుతారా అంటే అనుమానమే అనాలి.  పార్టీ పెట్టి ఇన్నేళ్లు అవుతున్నా పవన్ పార్టీ నిర్మాణం మీద కసరత్తు చేయలేదు.  కిందిస్థాయిలో పార్టీకి నాయకులంటూ లేరు.  కార్యకర్తలు అయితే అక్కడక్కడా కనిపిస్తారు కానీ బరిలోకి దిగి పోటీ చేయగల వ్యక్తులు లేరు.  అసెంబ్లీ ఎన్నిక్లలోనే అన్ని స్థానాల్లో నిలబెట్టడానికి అభ్యర్థులు లేరు జనసేనకు.  అలాంటిది వేల మందిని స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టడం దాదాపు అసాధ్యమే.  ఈ బలహీనతను కవర్ చేసుకోవడానికి ఏదో ఒక బలమైన పార్టీతో పొత్తులో ఉండాలి.  కానీ జనసేన స్నేహం చేస్తున్నది బీజేపీతో. 
 
రాష్ట్రం బీజేపీ పరిస్థితి జనసేన కంటే దారుణం.  నోటా స్థాయి ఓటు బ్యాంకు కూడ లేని పార్టీ అది.  అలాంటి వారికి లోకల్ లీడర్లు ఉంటారని ఎలా అనుకోగలం.  వార్డు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులను సమీకరించడం అసెంబ్లీ స్థాయి నాయకుల పని.  ఇక్కడ జనసేనకు ఆ స్థాయిలోనే లీడర్లు లేరు.  అలాంటప్పుడు అభ్యర్థులను సమీకరించేది, పోటీలో నిలబెట్టేది. ఎన్నికలు జరిపించేది ఎవరు.  ఈ కారణాలన్నీ కలిసి లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడ జనసేనకు చేదు అనుభవం ఎదురయ్యేలా చేస్తాయేమో అనిపిస్తోంది.