అదేంటీ, నందమూరి నట సింహం కదా.? పైగా, హిందూపురం ఎమ్మెల్యే కూడా, ‘కమ్మ’జాతి రత్నంగానూ నందమూరి బాలకృష్ణ గురించి కొందరు టీడీపీ మద్దతుదారులు చెబుతుంటారు. కానీ, అదంతా సినిమా వరకే. రాజకీయాల్లో బాలకృష్ణని తట్టుకోవడం టీడీపీ క్యాడర్‌కే చాలా కష్టం.
హిందూపురం నుంచి వరుసగా రెండుసార్లు బాలయ్య ఎలా గెలిచారన్నది ఇప్పటికీ టీడీపీ శ్రేణుల్లో ఎవరికీ అర్థం కాని విషయం. ఆ రకంగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే బాలయ్య చాలా చాలా బెటర్. కానీ, క్రౌడ్ పుల్లింగ్‌లో మాత్రం, జనసేన అధినేత టాప్.!
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో బాలయ్య రోడ్డెక్కలేకపోయారు. కానీ, పవన్ కళ్యాణ్ అలా కాదు, చంద్రబాబుకి అండగా నిలిచారు. బాలయ్య కూడా అండగా నిలిచినట్లు కనిపించినా, ఆ హైప్ టీడీపీలోనే రావట్లేదాయె. అలా టీడీపీ క్యాడర్ కూడా బాలయ్య కంటే పవన్ కళ్యాణ్ బెటరన్న భావనతో వుంది.
కాదు కాదు, నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు.. బాలయ్య చక్రం తిప్పుతారు.. అన్నది కొందరు టీడీపీ మద్దతుదారుల ఉవాచ. పలువురు టీడీపీ నేతలు ఇదే మాట చెబుతున్నారు. కానీ, ‘వద్దు బాబోయ్ బాలయ్య..’ అంటోంది టీడీపీలోని ఇంకో వర్గం. అటు లోకేష్ వద్దు, ఇటు బాలయ్య వద్దు.. ఈ ఇద్దరూ కాకపోతే ఎలా.?
చంద్రబాబేమో జైల్లో వున్నారు. వచ్చే ఎన్నికల్లోపు ఆయన బయటకు వస్తారో లేదో తెలియదు.! ఈ గందరగోళ పరిస్థితుల్లోనూ లోకేష్, బాలయ్య వద్దని పార్టీలో ఓ వర్గం భావిస్తుండడమేంటి.? వీళ్ళిద్దరికంటే బ్రాహ్మణి బెటర్.. అనే కొత్త వాదన తెరపైకొస్తోంది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేరుకీ టీడీపీలో పెద్దగా మద్దతు కనిపించడంలేదు.
పరిస్థితి చూస్తోంటే, ముందు ముందు టీడీపీలో జూనియర్ ఎన్టీయార్ కోసం వాయిస్ గట్టిగా పెరిగే అవకాశాలు కనిపిస్తాయనిపిస్తోంది. కానీ, జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల కోసం సంసిద్ధంగా లేడు. వస్తే మాత్రం, టీడీపీకి కొంత వైభవం అయితే రావొచ్చు.