నిజామాబాద్ లో కేసిఆర్ సభ వేళ టిఆర్ఎస్ కు షాక్ మీద షాక్

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేసే దిశగా టిఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తున్నది. కొంగర కలాన్ సభ ముగిసిన వెంటనే హుస్నాబాద్ లో తొలి రాజకీయ ప్రచార సభ జరిపింది టిఆర్ఎస్. కానీ ఆ సభ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. అయితే ఈనెల 3వ తేదీ బుధవారం నిజామాబాద్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నది. ఈ సభా ఏర్పాట్లలో టిఆర్ఎస్ నేతలు నిమగ్నమైన వేళ టిఆర్ఎస్ కు బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలం,  హాసకొత్తూరు గ్రామంలో ఊహించని రెండు షాక్ లు తగిలాయి. గ్రామస్థులు తెలిపిన ఆ వివరాలు ఏంటో కింద చదవండి.

హాస కొత్తూరు గ్రామంలో 3వేల పైచిలుకు ఓటర్లు ఉంటారు. జనాభా నాలుగు వరకు ఉంటారు. ఈ గ్రామానికి పక్కనే ఉన్న చౌటుపల్లి హన్మంతరెడ్డి లిఫ్ట్ నుంచి సాగునీరు అందాల్సి ఉంది. ఈ మేరకు ఆ లిఫ్ట్ నుంచి నీటిని అందించే విషయంలో ఇప్పటికే గేట్ వాల్వ్ కూడా సాంక్షన్ అయింది. పనులు మొదలు పెట్టి వెంటనే నీరు అందించాలని గ్రామస్తులు ఎప్పటినుంచో కోరుతున్నారు. అయినా పనులు జరగలేదు. 

 
హాసకొత్తూరు గ్రామంలో సమవేశమైన గ్రామ అభివృద్ధి కమిటీ
 

మిషన్ భగీరథ పథకానికి వైస్ ఛైర్మన్ గా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలోని ఈ గ్రామంలో ఈ పరిస్థితి రావడం పట్ల గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు గేట్ వాల్వ్ బిగించి నీటిని సరఫరా చేయాలని గ్రామస్తులు కోరినా అధికార పార్టీ నేతలు పెడ చెవిన పెట్టారు. అయితే ఈ గ్రామానికి నీటిని సరఫరా చేస్తే చౌటుపల్లి గ్రామస్థులకు ఆగ్రహ తెప్పించిన వారం అవుతామన్న ఉద్దేశంతో కూడా ఈ పనులు పెండింగ్ లో పెట్టారన్న చర్చ ఉంది. 

 
 

ఈ నేపథ్యంలో హాసకొత్తూరు గ్రామ అభివృద్ధి కమిటీ సోమవారం సమావేశమై రెండు సంచలన నిర్ణయాలు తీసుకున్నది. అందులో ఒకటి ఏమనగా రేపు అంటే మంగళవారం నిజామాబాద్ లో జరగనున్న కేసిఆర్ సభకు గ్రామం నుంచి ఎవరూ వెళ్లరాదని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గ్రామ అభివృద్ధి  కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. గ్రామ అభివృద్ధి కమిటీ సమావేశంలో సుమారు 800 మంది పాల్గొన్నారు. ఈ తీర్మానం కాపీ రాతపూర్వకంగా వెలువరించారు కింద ఉంది చూడొచ్చు.

 
కేసిఆర్ సభకు హాసకొత్తూరు గ్రామం నుంచి ఎవరూ హాజరు కావొద్దని చేసిన తీర్మానం కాపీ ఇదే
 

ఇక మరో నిర్ణయమేమనగా గ్రామానికి నీటిని అందించే క్రమంలో గ్రామ కమిటీ వారు జిల్లా కేంద్రానికి వెళ్లి ఇరగేషన్ ఎస్ఇ, డిఇలను కలిసి తమ గోడు వెల్లడించాలని అనుకున్నారు. అయితే వారు అలా సొంతంగా వెళ్లి ఎస్ఇ ని, డిఇ ని కలిస్తే స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి అవమానంగా ఉంటుందని ఆ ప్రయత్నాన్ని విరమించపజేశారు స్థానిక ఎంపిటిసి తెడ్డు రాజన్న అనే టిఆర్ఎస్ నేత. ఊరి వాళ్లంతా వెళ్లాల్సిన అవసరం లేదని టిఆర్ఎస్ నేతలమైన తామే ఎమ్మెల్యే ద్వారా ఆ పని చేయిస్తామని గ్రామస్తులను నమ్మబలికారు. దీంతో వారంతా ఎంపిటిసి తెడ్డు రాజన్న మాట మీద నమ్మకం ఉంచి వారి ప్రతయ్నాలు మానుకున్నారు.

 
 

అయితే ఇంతకాలమైనా నీటిని తేలేకపోవడం, పనలు మొదలు పెట్టకపోవడంతో గ్రామస్తుల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తెడ్డు రాజన్న అనే ఎంపిటిసి సొంతంగా పనిచేయించలేకపోగా గ్రామస్తులందరం కలిసి చేయాలనుకున్న ప్రయత్నాలకు కూడా గండికొట్టిండన్న ఆగ్రహంతో ఉన్నారు జనాలు. ఈ మేరకు ఇవాళ జరిగిన గ్రామ అభివృద్ధి కమిటీ సమావేశంలో గ్రామ ప్రయోజనాలను దెబ్బ తీశాడన్న ఉద్దేశంతో ఎంపిటిసి తెడ్డు రాజన్నకు 45వేల జరిమానా విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన ఒక యువకుడు ‘తెలుగురాజ్యం’ కు ఫోన్ ద్వారా తెలిపాడు. 

హాసకొత్తూరు గ్రామంలో తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు నిజామాబాద్ లో సంచలనం రేపుతున్నాయి. మరికొద్ది గంటల్లోనే కేసిఆర్ సభ నిజామాబాద్ లో జరగనున్న వేళ సభకు ఎవరూ వెళ్లరాదని నిర్ణయం తీసుకోవడం ఒకటైతే, గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నేతకు జరిమానా విధించడం మరకటి. ఈ రెండు ఘటనలు టిఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ గానే చెబుతున్నారు.  

గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేసిన వీడియో కింద ఉంది చూడొచ్చు.