పురందేశ్వరికి నిర్మలా సీతారామన్ షాక్… చంద్రబాబు – పవన్ కి కూడా!

గతకొంతకాలంగా దున్నపోతు ఈనిందని చంద్రబాబు చెప్పడం… దూడను కట్టేయండని పవన్ కల్యాణ్ చెప్పడం వంటి సంఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవాలతో సంబంధం లేకుండా.. నిజానిజాల ప్రమేయం లేకుండా… ఇలాంటి విమర్శలు గతకొంతకాలంగా చంద్రబాబు – పవన్ లు చేస్తోన్న సంగతి తెలిసిందే!

ఇదే క్రమంలో తాజాగా వీరిద్దరికీ ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తోడయ్యారు! చంద్రబాబు – పవన్ లు చేసిన విమర్శలనే ఈమెకూడా చేయడం మొదలుపెట్టారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు చెబుతున్నా… వినిపించుకునే పరిస్థితి లేదన్నట్లుగా పురందేశ్వరి.. ఏపీ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. ఏపీలో అప్పులు పెరిగిపోయాయంటూ చెప్పుకొస్తున్నారు.

ఈ సమయంలో పురందేశ్వరితో పాటు చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు కళ్లు తెరిపిస్తూ కేంద్రమంత్రి నిర్మళా సీతారామన్ తాజాగా పార్లమెంటులో స్పందించారు. పరోక్షంగా పురందేశ్వరి, చంద్రబాబు, పవన్ లు కలిసి ఏఫీ సర్కార్ పై చేస్తోన్నవి అసత్య ఆరోపణలు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

అవును… ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అప్పులపై కేంద్ర ప్రభుత్వం పరిపూర్ణమైన క్లారిటీ ఇచ్చింది. ఏపీలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముగిసి వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్న అప్పు.. 2019 మార్చి నాటికి రూ.2,64,451 కోట్లు అని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

అదే విధంగా… వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులతో కలిపి ఇప్పుడు ఆ సంఖ్య రూ.4,42,442 కోట్లకు చేరుకున్నట్లు నిర్మల వెల్లడించారు. అంటే.. వైసీపీ సర్కార్ ఈ నాలుగేళ్లలో చేసిన అప్పు రూ.1,77,991 కోట్లుగా నిర్మల పార్లమెంటు సాక్షిగా మరోసారి స్పష్టం చేశారు.

దీంతో చంద్రబాబు ప్రభుత్వం కంటే… ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్న జగన్ సరకారే తక్కువ అప్పులు చేసిందని స్పష్టమైంది. కోవిడ్ సమయంలో రాష్ట్రం ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడినా… జగన్ సంక్షేమ పథకాల అమలు వాయిదా వేయడం కానీ.. నిలివేయడం కాని చేయలేదు. అయినప్పటికీ చంద్రబాబుకంటే తక్కువ అప్పులే చేశారు.

ఈ విషయంపై ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి క్లారిటీ ఇచ్చారు. దీంతో… ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి చంద్రబాబు – పురందేశ్వరి – పవన్ లు ఏపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు, అబద్దాల విమర్శలు మానుకుంటారా.. లేక, వాస్తవాలతో తమకు పనిలేదు.. బురదజల్లడమే తమ పని అన్నట్లుగా కంటిన్యూ అవుతారా అన్నది వేచి చూడాలి!