విశాఖ జిల్లా రాజకీయం మొత్తం రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చేతుల్లోనే నడుస్తున్న సంగతి తెలిసిందే. పాలన, పార్టీ వ్యవహారాలు, అధికారుల నియామకం, బదిలీలు లాంటివి అన్ని ప్రధాన విషయాలను విజయసాయిరెడ్డే చూసుకుంటున్నారు. ఆయన నేతృత్వం పట్ల హైకమాండ్ సైతం సంతృప్తిగానే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. త్వరలో రాజధాని కానున్నందున విశాఖను పూర్తిగా గ్రిప్లో పెట్టుకోవాలని విజయసాయి కూడ బాగా కష్టపడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంకు ఎక్కడా వెసులుబాటు అనేదే లేకుండా చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఆయన వేసిన ఒక ఎత్తును ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పటాపంచలు చేసినట్టు చెప్పుకుంటున్నారు.
త్వరలో విశాఖలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారమే రీనోటిఫికేషన్ వెలువడింది. అయితే రీనోటిఫికేషన్ రావడానికి ముందే విశాఖ మున్సిపల్ కమీషనర్ సృజన నెల రోజులు సెలవుపై వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. అధికారులు సెలవుపై వెళ్లడం మామూలే అయినా ఆమె వెళ్లిన సమయమే పలు చర్చలకు దారితీస్తోంది. సాధారణంగా మున్సిపల్ ఎన్నికల్లో కమీషనే రిటర్నింగ్ అధికారిగా ఉండాలి . మూడేళ్లకు పైబడి అక్కడే ఉన్నవారిని ఎన్నికల సమయంలో ఈసీ బదిలీ చేస్తారు. ఈ నియమాల్లో ఎలాంటి మార్పు ఉండదు. సృజన సైతం మూడేళ్ళ బట్టి విశాఖలోనే పలు భాద్యతలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆమెను ఈసీ బదిలీ చేసే అవకాశం ఉంది.
కానీ ఆమెనే ఇంకొంతకాలం కమీషనర్ పదవిలో ఉంచాలని భావించిన విజయసాయిరెడ్డి ఎన్నికలు ముగిసేవరకు సెలవుపై పంపి, ఎన్నికల తర్వాత మళ్ళీ పదవిలో కూర్చోబెట్టాలని ప్లాన్ చేసినట్టు ఒక వర్గం మీడియా చెబుతోంది. ఈ నెల రోజుల్లో తాత్కాలికంగా వేరొక ఐఏఎస్ అధికారిని ఎన్నికల ఇంఛార్జిగా నియమించారు. అయితే ఈ పోస్టులో ఇంఛార్జిని నియమించడం కుదరదని, రెగ్యులర్ అధికారినే నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో సెలవు వ్యూహం బెడిసి కొట్టినట్టైందట.
దీంతో చేసేది లేక ప్రభుత్వం విశాఖ కొత్త కమిషనర్ నియామకం కోసం ఎస్‌ఈసీకి ప్యానల్ పంపించింది. ప్రభుత్వం పంపిన ప్యానల్ నుంచి ప్రస్తుతం ఏపీఈపీడీసీఎల్ ఎండీ, వైస్‌చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న నాగలక్ష్మిని ఎస్‌ఈసీ ఎంపిక చేసింది. ఆమెను విశాఖ కమిషనర్ పదవిలో నియమిస్తూ మంగళవారం పొద్దుపోయాక ఆదేశాలు జారీ చేసింది.