ఓటు హక్కు కోల్పోయిన 3.62 లక్షల మంది యువత తరఫున తాను స్పందించి ఇద్దరు అధికారులపై చర్య తీసుకున్నాను తప్పా, ఎవరో చెప్తే చేయలేదని తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ఎన్నిల కమిషన్, కమిషనరును వ్యక్తిగతంగా ఎవరూ నిందించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించినా.. ఓ మంత్రి తనపై విమర్శలు చేయడం బాధాకరమని నిమ్మగడ్డ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు తీర్పునకు, రాజ్యాంగ స్ఫూర్తికి, ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమని,అవసరమైతే అదే విషయాన్ని మళ్లీ కోర్టు ముందు ఉంచాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది అన్నారు.
తనకు హైదరాబాద్‌లో ఉన్న ఓటును స్వాధీనం చేసి.. సొంత ఊరు గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఊర్లో తనకు ఇల్లు, పొలం, ఇతర ఆస్తులు ఉన్నాయని.. తాను ఉద్యోగరీత్యా ఎక్కడ ఉన్నా, సొంత గ్రామానికి తరచూ వెళ్లి వస్తుంటాను అన్నారు. ఏ పౌరుడికైనా దేశంలో ఎక్కడో ఒకచోట ఓటు హక్కు కోరుకునే హక్కు ఉంటుంది కదా అన్నారు. హైదరాబాద్‌లోని తన ఓటును స్వాధీనం చేసిన సర్టిఫికెట్‌తో ఓటు హక్కు కల్పించాలని దుగ్గిరాల తహసీల్దారుకు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు.
ఓటు హక్కు వస్తే పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయాలనీ అనుకున్నా, దుగ్గిరాలలో ఉండటం లేదు కాబట్టి ఓటు హక్కు కల్పించడం లేదంటూ ఇప్పుడు నోటీసు పంపారన్నారు. తాను కొంత నిరాశ పడ్డానని, కానీ కక్ష సాధింపుగా వారిపై చర్య తీసుకోవాలని కోరలేదు అన్నారు. వారి విచక్షణాధికారాన్ని వారు ఉపయోగించారని.. తన దరఖాస్తును పునఃపరిశీలించాలని కలెక్టరును కోరాను అన్నారు. ఆయన కూడా చేయకపోతే… తన హక్కును కాపాడుకునేందుకు కోర్టుకు కూడా వెళతాను అని నిమ్మగడ్డ తెలిపారు.