కేంద్రానికి కిడారి హత్య కేసు…మరి జగన్ పై దాడి కేసు కూడా ?

చంద్రబాబునాయుడుకు కేంద్రం ఊహించని షాక్ ఇఛ్చింది, మొన్న సెప్టెంబర్ 23వ తేదీన జరిగిన అరకు దివంగత ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు హత్య కేసును సూమోటోగా కేంద్రం ఎన్ఐఏ విచారణకు తీసుకుంది. ఎంఎల్ఏ హత్య కేసును ఎన్ఐఏ విచారిస్తుందంటూ కేంద్ర హోం శాఖ చేసిన ప్రకటనతో చంద్రబాబు షాక్ కొట్టినట్లైంది. ఎందుకంటే, కిడారి హత్య కేసునే ఎన్ఐఏ విచారించాలని కేంద్రం నిర్ణయిస్తే మరి మిస్టరీగా మారిన జగన్మోహన్ రెడ్డి హత్య యత్నం కేసును కూడా ఎన్ఐఏతో విచారించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంతో చంద్రబాబు అండ్ కో లో టెన్షన్ మొదలైంది. వాళ్ళు భయపడుతున్నట్లు నిజంగానే అదే జరిగితే కుట్ర కోణం వెనుకున్న సూత్రదారులు బయటకు వస్తే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవన్నది అసలైన టెన్షన్.

 

నిజానికి కిడారి హత్య కేసును ఎన్ఐఏతో విచారణ జరపాల్సిన అవసరం ఏమిటో అర్ధం కావటం లేదు. ఎందుకంటే, కిడారిని హత్య చేసింది మావోయిస్టులే అన్నది అందరికీ తెలిసిన విషయం. ప్రజా కోర్టు నిర్వహించి స్ధానికుల ముందే నియోజకవర్గంలో మావోయిస్టులు కిడారిని, మాజీ ఎంఎల్ఏ సివేరి సోమాలను కాల్చి చంపారు. చంపిన వాళ్ళెవరో తెలుసు. ఎందుకు చంపారో కూడా తెలుసు. మావోయిస్టుల హత్యకు సహకరించిన స్ధానిక టిడిపి నేతలను కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కిడారిని తామే హత్య చేసినట్లు మావోయిస్టులు కూడా ప్రకటించుకున్నారు. కాల్చి చంపిన వాళ్ళెవరూ కూడా సిట్ అధికారులకు తెలుసు. తర్వాత జరిగిన ఎన్ కౌంటర్లో వాళ్ళని పోలీసులు కాల్చేశారు.

 

అంటే, జరిగిన పరిణామాలు చూస్తుంటే కిడారి హత్య అన్నది ముగిసిన చరిత్ర అనే అనుకోవాలి. కాబట్టి కిడారి హత్య కేసును ఎన్ఐఏ విచారించి కొత్తగా తెలుసుకునేదేమీ లేదనే అనుకోవాలి. ఆ తర్వాత నెలరోజులకే  విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నం జరిగింది. దాడి చేసిన నిందితుడిని కూడా పోలీసులు పట్టుకున్నారు. గాయపడిన జగన్ తర్వాత కోలుకుని పాదయాత్ర కంటిన్యు చేస్తున్నారు. హత్యాయత్నం కేసులో సిట్ విచారణ వేసింది ప్రభుత్వం. ఇక్కడే సమస్య మొదలైంది. కుట్ర కోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి నేతలెవరినీ సిట్ విచారించలేదు. పైగా కేసును నీరుగార్చేందుకే చూస్తోంది. నిందితుడుకి కూడా స్టేషన్లో కూర్చోపెట్టి మూడు పూటలా బిర్యానీలు తినిపించారు పోలీసులు.

 

జరిగిన విచారణ చూసిన తర్వాతే థర్డ్ పార్టీ విచారణ కోరుతూ జగన్ కోర్టులో కేసు వేశారు. ఆ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.  అందరూ ముగిసిందనుకుంటున్న కిడారి కేసునే ఎన్ఐఏ విచారణకు తీసుకున్న తర్వాత మిస్టరీగా మారిన హత్యాయత్న కుట్ర కేసును మాత్రం ఎన్ఐఏ ఎందుకు విచారించదనే ప్రశ్నలు మొదలయ్యాయి. కేంద్రం, కోర్టుల వైఖరి చూస్తుంటే తొందరలోనే జగన్ హత్యాయత్నం కేసులో కూడా ఎన్ఐఏ మొదలయ్యేట్లే కనిపిస్తోంది. నిజంగా అదే జరిగితే ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో కు సమస్యలు తప్పేట్లు లేదు.