తెలుగుదేశంపార్టీలోని కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇపుడవే అనుమానాలు మొదలయ్యాయి. అక్టోబర్ 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం గుర్తుందికదా ? ఆ ఘటనకు బాధ్యులని అనుకుంటున్న వారికి ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న మిగిలిన వారి సంగతెలా ఉన్నా హర్షవర్ధన్ చౌదరికి కూడా నోటీసులు ఇవ్వటమే కీలకంగా మారింది. ఘటనకు సంబంధించి విచారణ కోసం హాజరవ్వాలంటూ ఎన్ఐఏ మొత్తం 15 మందికి నోటీసులు ఇచ్చింది.
హత్యాయత్నం ఘటనను ఎన్ఐఏ విచారించటాన్నే చంద్రబాబునాయుడు అండ్ కో తప్పు పడుతోంది. ఎన్ఐఏ విచారణకు వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్ వేసే ఉద్దేశ్యంలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా టిడిపి ఎందుకు చేస్తోందంటే హత్యాయత్నం ఘటనలో సూత్రదారుల బండారం బయటపడకుండా ఉండాలనే. హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్ కేవలం పాత్రదారి మాత్రమే అని అందరికీ తెలిసిందే. అయితే, శ్రీనివాస్ కు జగన్ పైన హత్యాయత్నం చేసేంత సీన్ లేదని అందరికీ తెలుసు. అందుకనే నిందితుడిని వెనుక నుండి ఎవరో ఉసిగొల్పారంటూ జగన్ అండ్ కో మొదటి నుండి వాదిస్తున్నారు. శ్రీనివాస్ ను హత్యాయత్నం చేయమని పురమాయించిందెవరు అన్న విషయం బయటకు రావటమే మిగిలింది.
ఘటనపై ప్రాధమిక విచారణ చేసిన సిట్ హత్యాయత్నం ఘటనలోకుట్రకోణం ఏమీ లేదని దర్యాప్తులో తేల్చేసింది. తనపై జరిగిన దాడిలో కచ్చితంగా కుట్రకోణం ఉందని జగన్ మొదటి నుండి అనుమానిస్తున్నారు. అయితే, ప్రధాన ప్రతిపక్షనేతపై జరిగిన దాడిని చంద్రబాబు కోడికత్తి దాడి అంటూ ఎగతాళి చేయటమే విచిత్రంగా ఉంది. అందుకనే మొదటి నుండి జగన్ పై జరిగిన దాడిని అంతా డ్రామాగా కొట్టిపాడేస్తోంది. ఇటువంటి నేపధ్యంలోనే హత్యాయత్నం ఘటన విచారణ బాధ్యతను హైకోర్టు ఎన్ఐఏకి అప్పగించింది. ఎప్పుడైతే ఎన్ఐఏ విచారణ మొదలయ్యిందో అప్పటి నుండో చంద్రబాబు అండ్ కో లో టెన్షన్ పెరిగిపోతోంది.
ఎలాగూ నోటీసులిచ్చింది కాబట్టి ఎయిర్ పోర్టులో క్యాంటిన్ ఓనర్, టిడిపి నేత హర్షవర్ధన్ చౌదరిని కూడా ఎన్ఐఏ విచారణ చేయనుంది. ఒకసారి హర్ష విచారణ మొదలైతే హత్యాయత్నం కుట్రలో సూత్రదారులు బయటకు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే టిడిపికి ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే, రేపటి ఎన్నికల్లో ఈ కుట్రకోణాన్నే జగన్ అండ్ కో ఆయుధంగా ప్రయోగించే అవకాశాలున్నాయి. చంద్రబాబులో ఆ భయమే స్పష్టంగా కనబడుతోంది. మరి విచారణలో ఎన్ఐఏ ఎటువంటి సంచలనాలు బయటపెడుతుందో చూడాల్సిందే.