రాజకీయాల్లో దెబ్బలు తగులుతుండటం అత్యంత సహజం. వీటిలో కొన్ని ఊహించని క్రమంలో జరిగితే.. మరికొన్ని స్వయంకృతాపరధాలు. ఈ సమయంలో ఆ మిస్టేక్స్ వల్ల కొత్త పాఠాలు నేర్చుకోవాలి.. తిరిగి ఆ తప్పులు మాత్రం చేయకూడదు అని అంటుంటారు రాజకీయ పండితులు. అయితే ఈ విషయంలో టీడీపీ నేతలు మాత్రం చేసిన తప్పే మళ్లీ చేస్తామంటున్నారు!
అవును… గాయం ఒక మదుర జ్ఞాపకం అంటారు. అలా అని కావాలని కాల్చుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. అది జ్ఞాపకం కాదు.. అజ్ఞానం తాలూకు మచ్చ! అయితే ఈ విషయాలు తెలియకో.. లేక, తెలిసే మూర్ఖత్వంలో భాగంగానో చేసిన తప్పులే చేయడానికి సిద్ధపడుతూ, కొనసాగిస్తున్నారు అరకు అసెంబ్లీ నియోజకవర్గంలోని తమ్ముళ్లు.
2019 ఎన్నికల్లో టీడీపీ నేతలకు గెలిచే అవకాశం ఉన్నా.. ఇబ్బడి ముబ్బడిగా సింపతీ వచ్చినా.. అంతర్గత కుమ్ములాటలు.. ఆధిపత్య రాజకీయంతో అత్యంత కీలకమైన అరకు అసెంబ్లీ నియోజకవర్గాన్ని పార్టీ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గెలవాల్సిన సీటును చేజేతులా కాలదన్నుకుంది. గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు చేసిన తప్పుల్లో ఇదొకటి!
2014 ఎన్నికల్లో అరకు నుంచి ఎస్టీ నాయకుడు.. కిడారి సర్వేశ్వరరావు వైసీపీ తరఫున విజయం దక్కించుకున్నారు. తర్వాత వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన 23 మంది లో ఒకరిగా నిలిచి… టీడీపీకి జై కొట్టారు. అనంతరం మావోయిస్టులు ఆయనను హత్య చేశారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్ ను చంద్రబాబు చేరదీశారు.
అనంతరం 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఆయనకు టికెట్ ఇచ్చారు. అయితే.. ఆయన గత ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూశారు. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు. దానికి గల కారణం ఏమిటనేది చంద్రబాబుకు, శ్రావణ్ కుమార్ కూ స్పష్టం తెలుసు. ఇది పూర్తిగా స్వయంకృతాపరాధం అనే విషయం తెలుసు.
2019 ఎన్నికల సమయంలో కిడారిని మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో ఆ కుటుంబానికి గిరిజనుల నుంచి విపరీతంగా సింపతీ వచ్చింది. దీంతో కిడారి శ్రావణ్ గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా టీడీపీకే చెందిన మరో గిరిజన నాయకుడు సియ్యారి దొన్నుదొర కూడా టికెట్ కావాలని పట్టుబట్టారు.
ఇంతజరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. గెలవాల్సిన సీటు విషయంలో ఇలా అనవసరమైన రిస్క్ ఎందుకని ఆలోచించలేదు. సియ్యారి దొన్నుదొర ను పిలిపించి బుజ్జగించే ప్రయత్నమూ చేయలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీచేశాడు. ఫలితంగా టీడీపీ ఓట్లు చీలిపోయాయి. విజయం దక్కించుకుంది.
అది గతం.! ఇప్పుడు మరోసారి ఎన్నికలకు వేళయ్యింది. అన్ని పార్టీలూ ఆ దిశగా పనులు చేసుకుంటూపోతున్నారు. ఈ సమయంలో అరకు టీడీపీలో మళ్లీ సేం సీన్ రిపీట్ అవుతోంది. మరోసారి టిక్కెట్టు తమకు కావాలంటే.. తమకు కావాలంటూ కిడారి శ్రావణ్ – సియ్యారి దొన్నుదొర వర్గాలు టికెట్ కోసం కుస్తీ పడుతున్నాయి.
గతంలో జరిగిన డ్యామేజీ కళ్లముందు కనిపిస్తున్నా కూడా ఈ వర్గాలకు జ్ఞానం కలగడం లేదని అంటున్నారు స్థానిక తమ్ముళ్లు. ఇదే సమయంలో విరిద్దరి మధ్యా టిక్కెట్ కోసం వర్గ పోరు ఉండటం సహజమే అయినా… చంద్రబాబు అచేతనంగా ఎందుకు నిలుచుండిపోయారు అని ప్రశ్నిస్తున్నారు పరిశీలకులు.
ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే… ఇలాంటి నియోజకవర్గాలు ఇంకా చాలానే ఉన్నాయని చెబుతున్నారు. సత్తెనపల్లి మొదలు, గుడివాడతో కలిపి వెలుగులోకి రావాల్సిన ఎన్నో నియోజకవర్గాల వర్గపోరు విషయంలో బాబు అచేతనంగా ఉంటున్నారని… దాని ఫలితంగా రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా చూసే ఛాన్స్ ఉందని అంటున్నారు!