ఓ పాత సినిమాలో ‘దాచాలాంటే దాగవులే..దాగుడు మూతలు సాగవులే’ అనే పాటొకటుంది. అదే పద్దతిలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ బంధం బయపడిపోతోంది. పైకి వైరం నటిస్తూనే లోలోపల మాత్రం టిడిపి, జనసేనలు సర్దుబాట్లు చేసుకున్నాయి. ఆ విషయం అభ్యర్ధుల నామినేషన్ సందర్భంగా బయటపడిపోయింది. అంతుకుముందు చివరి నిముషంలో వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను మార్చేయటంతోనే ఆ విషయం స్పష్టంగా తెలిసిపోయింది.
నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ తన సోదరుడు నాగుబాబును దించటం, టిడిపి తరపున చివరి నిముషంలో శివరామరాజు రంగంలోకి రావటం ఒక ఉదాహరణ మాత్రమే. అంటే వైసిపి తరపున అభ్యర్ధిగా కాపు దిగితే జనసేన కూడా కాపునే పెట్టటం. వైసిపి తరపున బిసి అభ్యర్ధి ఉన్నచోట్ల జనసేన కూడా బిసిలనే రంగంలోకి దించటం లాంటివన్నమాట.
సరే చంద్రబాబు, పవన్ ఎన్నిమాటలు చెప్పినా జనాలు నమ్మేస్ధితిలో లేరన్నది వాస్తవం. దానికి సాక్ష్యాలుగా టిడిపి, జనసేన అభ్యర్ధులు కలిసి ప్రచారం చేసుకోవటం వాళ్ళ బంధానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చంద్రగిరిలో టిడిపి, జనేసన పార్టీల నేతలు కలిసే ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో టిడిపి అభ్యర్ధి వర్మ మాట్లాడుతూ తమ రెండు పార్టీలు మిత్రపక్షాలే అని స్పష్టంగా చెప్పారు.
అంతేకాకుండా జనసేన అభ్యర్ధి ఎదురుపడినపుడు అదే విషయాన్ని బాహాటంగానే ప్రకటించారు. నెల్లూరులో కూడా జనసేన, టిడిపిలు రెండు ఒకటే కాబట్టి కలిసి ప్రచారం చేసుకుంటే తప్పేలేదని ఓ టిడిపి నేత చెప్పిన వీడియో వైరల్ గా మారింది. అంటే పై స్ధాయిలో చంద్రబాబు, పవన్ నాటకాలాడుతున్న విషయం క్రిందస్ధాయిలోని నేతల మాటల ద్వారా బయటపడిపోతోంది. ఈ విషయాలను గ్రహిస్తున్న జనాలు ఏం చేస్తారో చూడాలి.