తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీపై పీటముడి

దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలల్లో పాలన కుంటుపడవద్దని అభివృద్దితో ముందుకు సాగాలని, అందులో కీలక పాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శుల నియమాకం జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ప్రతీ ఊరికి ఒక కార్యదర్శి ఉండాల్సిందేనని 9355 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను రెండు నెలల్లో నియమాకాలు జరపాలన్నారు. కేభినెట్ భేటిలో నిర్ణయించి ఆదేశాలిచ్చారు సీఎం. ఇంత వరకు బాగానే ఉన్నా ఎలా నియమించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా అయితే ఈ నియామకాలు టిఎస్‌పీఎస్సీ చేపడుతుంది. కానీ ప్రభుత్వం టిఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీల ద్వారా నియామకాలు చేపట్టాలని దానికి సంబంధించిన ప్రాసెస్ ను తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. రిక్రూట్  ఏజన్సీలు, రిక్రూట్ మెంట్ సంస్థలు నియామకాలు జరపాలంటే చేతులెత్తేస్తున్నాయి.

31 జిల్లాల ప్రకారం నియామకాలు చేపట్టాలన్నా రాష్ట్రపతి ఉత్తర్వు లేకుండా కొత్త జిల్లాల ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేపట్టలేమని అధికారులు తేల్చి చెప్పారు. నియామకాలు చేపడితే పాత జిల్లాల ప్రకారమే చేపట్టాలని గతంలో కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామకాల కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ను హైకోర్టు కొట్టేసిందని అధికారులు గుర్తు చేశారు. ఇదంతా ఒక్క సమస్య అయితే అధికారులకు రెండు నెలల గడువు మరో సమస్యగా మారింది. రెండు నెలల్లో ఎట్టి పరిస్థితిలో నియామకాలు సాధ్యం కాదంటున్నారు. ఇప్పటికే పలు ఏజెన్సీలు, రిక్రూట్ మెంట్ బోర్డులతో సీఎస్ చర్చించారు. పరీక్ష నిర్వహించాలంటే ఆరు నెలల గడువు కావాలని అప్లికేషన్ ప్రాసెస్ కే రెండు నెలల సమయం పడుతుందని జెఎన్టీయూ అధికారులు ప్రభుత్వానికి తెలిపారట. దీంతో సీఎస్ జెఎన్టీయూ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష నిర్వహణ చేతకాకనే ఈ విధంగా మాట్లాడుతున్నారని సీఎస్ మండిపడ్డారట. పంచాయతీరాజ్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలోనే ఈ పరీక్ష నిర్వహించాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక పంచాయతీ కార్యదర్శుల అర్హత కూడా పరీక్ష నిర్వహణకు అడ్డంకిగా మారింది. ఇప్పటి వరకూ 4 గ్రేడుల్లో కార్యదర్శుల నియామకం జరిపారు. దీనికి డిగ్రీ అర్హతగా ఉంది. కొత్త నియామకాలను ఇంటర్ అర్హతతో నిర్వహించాలా లేక డిగ్రీ అర్హతతో నిర్వహించాలా అని అధికారులు పరేషాన్ లో పడ్డారు. గ్రేడ్ 4 కార్యదర్శులుగా కాకుండా జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులుగా నియామకాలు చేయాలని అధికారులు భావిస్తున్నారని తెలుస్తోంది. వీటన్నింటిపై సీఎంతో అధికారులు చర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నారు. రెండు నెలల్లో నియామకాల పూర్తి సాధ్యం కాదని అర్ధమవుతుంది. కొత్తగా ఎంపికైన వారిని కాంట్రాక్టు కార్యదర్శులుగానే పరిగణించి మూడేళ్ల తర్వాత వారి పనితీరు ఆధారంగా పర్మినెంట్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇది సరైన పద్దతి కాదని నిరుద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఓయూ జెఏసీ లు ప్రకటించాయి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఏం చేయాలో తమ పంథా చెబుతామని నిరుద్యోగ సంఘాలు అనడంతో కోర్టు చిక్కులు రాకుండా అధికారులు కసరత్తు చేస్తూ నిబంధనలు తయారుచేస్తున్నారని తెలుస్తోంది.