సెన్సేషనల్ న్యూస్: జగన్ ఆస్తుల కేసులో కొత్త ట్విస్ట్

జగన్ ఆస్తుల కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. సిబిఐ కోర్టులో మళ్ళీ మొదటి నుండి విచారణ ప్రారంభం కానుంది. ఉమ్మడి హై కోర్టు విభజన కావడంతో నాంపల్లి సిబిఐ కోర్టు జడ్జి వెంకట రమణ ఏపీకి బదిలీ అయ్యి వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కొత్త జడ్జి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 11 ఛార్జి షీట్లలో 3 ఛార్జి షీట్లపై రెండేళ్లుగా కొనసాగుతున్న విచారణలో కొత్త ట్విస్ట్ నెలకొంది. దీనిపై మరింత సమాచారం కింద ఉంది చదవండి.

జగన్ పై అక్రమాస్తుల కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపింది. దాదాపు ఏడేళ్లుగా దీనిపై విచారణ కొనసాగుతోంది. 3 సంవత్సరాల క్రితం ఈ కేసు గగన్ విహార్ కోర్టుకు బదిలీ అయింది. ఇక్కడ సిబిఐ న్యాయమూర్తిగా వెంకటరమణ ఉండేవారు. ఆయన ఉన్న సమయంలో 11 చార్జిషీట్లలోని 3 చార్జిషీట్ల విచారణ దాదాపు పూర్తి కావచ్చింది. డిశ్చార్జ్ పిటిషన్ తో పాటు ఇతర పిటిషన్లపై దర్యాప్తు కొనసాగుతూ వస్తోంది. ఇవి అంతిమ దశకు చేరుకున్న సమయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది.

ఉమ్మడి హైకోర్టు విభజన జరగడంతో జనవరి 1 న ఏపీలో కొత్త హైకోర్టు ప్రారంభం అయింది. అప్పటివరకు సిబిఐ కోర్టు న్యాయమూర్తిగా ఉన్న వెంకట రమణ హైకోర్టు జడ్జిగా ఏపీకి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త జడ్జి రావాల్సి ఉంది. అక్కడ ఇంఛార్జిగా మరొకరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈరోజు శుక్రవారం కావడంతో హైకోర్టుకు హాజరయ్యారు జగన్. కాగా ఇంచార్జ్ సెలవులో ఉన్న కారణంగా కేసు 25 వ తేదీకి వాయిదా పడింది. ఇక జగన్ ఇంటికి వెనుతిరిగి వెళ్లిపోయారు.

కాగా కోర్టులో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు చాల కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. మళ్ళీ మొదటి నుండి న్యాయమూర్తి ఈ కేసు విచారణ చేపట్టనున్నట్టు తేలింది. ఎందుకంటే ఈ మూడు ఛార్జి షీట్లు చాలా కీలకమైనవి. సిసి 9 చార్జిషీటుకు సంబంధించి జగతి పబ్లికేషన్స్ కి సంబంధించిన కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, నిందితులుగా ఉన్న ఛార్జి షీట్లలో ఎక్కడెక్కడ, ఎవరెవరి నుండి పెట్టుబడులు జగతి పబ్లికేషన్స్ కి వచ్చాయి? అనే అంశాలు ఆ ఛార్జి షీట్లో పేర్కొన్నారు. రాంకీ సంస్థలకు సంబంధించిన సిసి 10, వ్యాన్ పిక్ సంస్థలకు సంబంధించిన సిసి 14 ఛార్జి షీట్లపై మళ్ళీ మొదటి నుండి విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.