కొత్త టెన్షన్… మౌనం దేనికి అర్ధాంగీకారం?

సాధారణంగా మౌనం అర్ధాంగీకారం అంటారు! అయితే… ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి.. ఫలితాలకోసం జూన్ 4 వరకూ వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ సమయంలో జూన్ 9న విశాఖలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం అని వైసీపీ నేతలు బలంగా బల్లగుద్ది మరీ చెబ్బుతున్న పరిస్థితి. పైగా విశాఖలోని స్టార్ హోటల్స్ లోని రూమ్స్ అన్ని వైసీపీ నేతలు అడ్వాన్స్ బుక్కింగ్ చేశారని చెబుతున్నారు.

మరోపక్క టీడీపీ నుంచి మాత్రం ఎక్కడా చప్పుడు రావడం లేదు అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఇంకోవైపు విశ్లేషకులు, పలు ఎగ్జిట్ పోల్ విశ్లేషణలు, నెట్టింట బలమైన చర్చ తో పాటు సెఫాలజిస్టుల అంచనాలు వైసీపీ గెలుపువైపే సంకేతాలు ఇస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో… టీడీపీ అధినేత, నేతల మౌనం దేనికి అర్ధాంగీకారం అనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును… ఎన్నిక‌లు ముగిసి రోజులు గ‌డుస్తున్నాయి. ఫ‌లితాలు కూడా త్వర‌లోనే రానున్నాయి. మ‌రి ఫ‌లితాల‌పై తెలుగు త‌మ్ముళ్ల మౌనం ఎందుకు? అనే ప్రశ్న ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అధినేత, యువనేత నుంచి కింది స్థాయి నాయ‌కుల వ‌ర‌కు ఫలితాలపై నోరు మెద‌ప‌క‌పోవ‌డం వెనుక అసలు కార‌ణం ఏంటి.? మౌనం గెలుపున‌కు అంగీకార‌మా.? లేక మరి దేనికైనా సంకేతమా.? అనే ప్రశ్నలు తదనుగునంగా తెరపైకి వస్తున్నాయి.

దీంతో… టీడీపీ కేడ‌ర్ ‎లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొద‌లైంద‌ని.. పోలింగ్ జ‌రిగి రెండు వారాలు గ‌డిచినా.. పార్టీ నేత‌ల్లో ఒకప్పటి ఉత్సాహం క‌న‌బ‌డ‌టం లేద‌నే కామెంట్లూ వినిపిస్తున్నాయి. వాస్తవానికి పోలింగ్ ‎కు ముందు వ‌ర‌కూ తామే అధికారంలోకి వ‌స్తున్నామంటూ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఇత‌ర నేత‌లు కూడా బలంగా చెప్పారు.

ఒక దశలో క్లీన్ స్వీప్ అని.. వైనాట్ పులివెందుల వంటి మాటలు కూడా మాట్లాడిన పరిస్థితి. కౌంటింగే ఆలస్యం.. అధికారిక ప్రకటనే తరువాయి.. అధికారంలోకి వ‌చ్చేశాం అనే విధంగా మాట్లాడేవారు. అలాంటిది పోలింగ్ అయిన మరుసటిరోజు నుంచీ మౌనం వ‌హించ‌డం వెనుక వ్యూహ‌మా లేక ఇంకేదైనా కార‌ణం ఉందా అని చర్చలు ఇటీవల తీవ్రంగా జరుగుతున్నాయి.

వాస్తవానికి గ‌తంలో ఎన్నిక‌లు జ‌రిగిన రోజు లేదా ఆ మ‌ర్నాడు చంద్రబాబు మీడియా ముందుకొచ్చేవారు.. ఫ‌లితాలు ఎలా వ‌స్తాయ‌నేది ఊహిస్తూ త‌మ గెలుపుపై కామెంట్స్ చేసేవారు! అయితే రొటీన్ కి భిన్నంగా ఈసారి చంద్రబాబు ఫలితాలపై సరైన కామెంట్ చేయలేదు! ప్రధాని మోడీ నామినేష‌న్ స‌మ‌యంలో వార‌ణాసి వెళ్లిన‌ప్పుడు మాత్రమే స్పందించారు.

ఇందులో భాగంగా దేశంలోనూ, ఏపీ రాష్ట్రంలోనూ ఎన్డీయే అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్పారు. అది మిన‌హా ఇంకెక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆ త‌ర్వాత చంద్రబాబు విదేశీ ప‌ర్యట‌న‌కు వెళ్లిపోయారు. ఇదే క్రమంలో… యువకిశోరం నారా లోకేష్, అచ్చెన్నాయుడు లాంటి వారు కూడా గెలుపుపై ఎటువంటి ప్రక‌ట‌న‌లు చేయ‌లేదు.

ఇక.. పార్టీలో ఉన్న కొంతమంది కృష్ణా, గుంటూరు జిల్లా నేతలు మాత్రం అప్పుడప్పుడూ ఎన్నికల కమిషన్ ని, డీజీపీని క‌లిసి ఫిర్యాదులు చేయ‌డం.. వాటికి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేయడం మిన‌హా ప్రభుత్వం ఏర్పాటుపై ఏమీ మాట్లాడ‌టం లేదు. దీంతో… తమ్ముళ్లలో కొత్త టెన్షన్ పెరిగిపోయిందని అంటున్నారు పరిశీలకులు!