నందమూరి ఫ్యామిలీ ఇప్పుడు ఒక విచిత్రమైన టెన్షన్ లో ఉంది. ఎన్టీఆర్ పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రూ.100 రూపాయల ప్రత్యేక నాణెం విడుదల కార్యక్రమం సందర్భంగా ఆ ఫ్యామిలీలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. తాజాగా లక్ష్మీపార్వతి ఎంట్రీ ఇవ్వడంతో వ్యవహారం రసవత్తరంగా మారింది.
అవును… ఎన్టీఆర్ పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రూ.100 రూపాయల ప్రత్యేక నాణెం విడుదల కార్యక్రమం త్వరలో ప్రారంభించబోతోన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానం అదిందరినీ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.
నేరుగా కేంద్రం నుంచి ఆహ్వానం అదండంతో… కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరు హాజరవుతారని అంటున్నారు. ఈ ప్రోగ్రాంలో హాజరయ్యేందుకు వీలుగానే చంద్రబాబునాయుడు కూడా ఢిల్లీలో అనేక కార్యక్రమాలను పెట్టుకున్నారని సమాచారం.
ఈ సమయంలో కుటుంబ సభ్యులు అంతా హాజరవుతున్నారు బాగానే ఉంది కానీ… ఎన్ టీఆర్ భార్య లక్ష్మీపార్వతి హాజరవ్వడంపైనే ఆసక్తి నెలకొంది. కారణం… ఈ క్వాయిన్ ను రాష్ట్రపతి చేతుల మీదుగా ముందు ఎవరు అందుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.
వాస్తవానికి భర్త మరణించిన అనంతరం అతనికి వచ్చే ఏ అవార్డు అయినా భార్యే అందుకోవాలి. భార్య తర్వాతే కుటుంబ సభ్యులు వస్తారు. కానీ ఇక్కడ లక్ష్మీపార్వతిని ఎన్ టీఆర్ శాస్త్రోక్తంగా అందరిముందు వివాహం చేసుకున్నప్పటికీ కుటుంబ సభ్యులెవరూ అంగీకరించటం లేదు. అయితే అది వారి వ్యక్తిగత లేదా కుటుంబ సమస్య.
కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో పాల్గొనేందుకు ప్రోటోకాల్ అనేది ఒకటుంటుంది. దాని ప్రకారం ముందు భార్యే వస్తారు. మరిప్పుడు కాయిన్‌ను ఎవరు తీసుకుంటారన్నది సస్పెన్సుగా మారిపోయింది. ఎన్టీయార్ పేరుతో ఏ పురస్కారాన్ని అందించినా తానే అందుకోవాలని లక్ష్మీపార్వతి వాదిస్తున్నారు.
ఈ క్రమంలో నేరుగా రాష్ట్రపతికి ఆమె లేఖ రాయడం సంచలనంగా మారింది. ఎన్టీఆర్ తో తన పరిచయం, వివాహం, తానంటే గిట్టని చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యుల కుట్రలు వంటి అంశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో లక్ష్మీపార్వతి ప్రస్తావించారని తెలుస్తోంది. ఎన్టీఆర్ మరణానికి కారణం అయిన వారిని ఆ కార్యక్రమానికి ఎలా పిలుస్తారంటూ ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరోపక్క ఈనెల 28న ఎన్టీఆర్ పై రూపొందించిన ప్రత్యేక నాణేన్ని రాష్ట్రపతి భవన్ లో ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి చంద్రబాబు సహా నందమూరి కుటుంబ సభ్యులందరూ హాజరవుతారు. ఈ సమయంలో లక్ష్మీ పార్వతి లేఖ రాయడంతో… రాష్ట్రపతి భవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.