జగన్ వ్యతిరేకులతో షా… ఏపీలో బీజేపీ నయా స్కెచ్!

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీలో బీజేపీ నిర్వహించిన రెండు బహిరంగ సభల అనంతరం ఏపీలో రాజకీయ పరిణామాలు తెగ మారిపోతున్నాయి. అయితే ఇవన్నీ ఏపీలో ఒక్కశాతం ఓటు బ్యాంకు ఉన్న బీజేపీ కేంద్రంగా మారుతుండటం గమనార్హం. దీంతో ఏపీలో జగన్ శత్రువులుగా చెప్పుకునేవారందరితో అమిత్ షా భేటీలు అవుతుండటం.. వారి సహకారంతో ఏపీలో బీజేపీ కూడా ఎంతో కొంత ప్రభావం చూపగలిగేలా మార్చుకోవడానికి ప్లాన్స్ చేస్తున్నారు.

మైకందుకున్న ప్రతీసారీ ఏపీ ముఖ్యమంత్రి చెప్పే మాట… తాను దుష్ట చతుష్టయంతో పోటీ పడుతున్నాను అని. వారికి తోడు ఒక దత్తపుత్రుడు ఉన్నాడని. వీరంతా తనకు బద్దశత్రువులని. వీరంతా డబ్బును నమ్ముకుంటే తాను మాత్రం దేవుడిని – ప్రజలనూ నమ్ముకున్నాను అని. ఈ సమయంలో జగన్ శత్రువులుగా చెప్పుకున్న వారితో వరుసపెట్టి భేటీలు చేస్తున్నారు బీజేపీ అగ్రనేత అమిత్ షా.

అవును… జగన్ చెప్పే ఈ దుష్టచతుష్టయానికి ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దగ్గరవుతున్నట్టు తెలుస్తోంది. అంటే గతంలో దూరంగా ఉన్నారని కాదు కానీ… ఇప్పుడు మరింత దగ్గరవుతున్నారని భావించొచ్చు. ఇటీవలే ఢిల్లీలో చంద్రబాబుని పిలిపించుకుని మాట్లాడి కొత్త చర్చకు తెరలేపారు అమిత్ షా. గతంలో రామోజీరావుని, పవన్ కల్యాణ్ ని కూడా అమిత్ షా పలుమార్లు కలిశారు. అయితే ఇప్పుడు తాజాగా నేరుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంటికి వెళ్లబోతున్నారు.

ఇదే వరుసలో టీవీ-5 యాజమాన్యంపై కూడా బీజేపీకి సింపతీ ఉండే ఉండొచ్చు. ఇలా జగన్ చెప్పే దుష్టచతుష్టయానికి దగ్గరవుతున్న అమిత్ షా ఏపీలో కొత్త పొలిటికల్ గేం మొదలు పెట్టాలనుకుంటున్నారు! ఇప్పటికే ఏపీలో పొత్తు పొడవడం ఖాయంగా కథనాలొస్తున్న సమయంలో… ఇలా చంద్రబాబు ఆత్మీయులతో అమిత్ షా భేటీ కావడం కచ్చితంగా కీలక పరిణామమే.

మరి చంద్రబాబు ఆశిస్తున్నట్లు, పవన్ కోరుకుంటున్నట్లు, బీజేపీ పెద్దలు ఆశపడుతున్నట్లు కనిపిస్తున్న ఏపీ రాజకీయ పొత్తుల వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది వేచి చూడాలి. ఏది ఏమైనా… “ఏబీఎన్ రాధాకృష్ణ ఇంటికి అమిత్ షా” అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది!