ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసు నేపథ్యంలో మాజీ సీఎం జగన్ అరెస్ట్ గురించి రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో పెద్ద చర్చ సాగుతోంది. ఒక్కటంటే ఒక్కటిగా ప్రతి బిజీ గ్రూప్స్ లోను, చానెల్ డిబేట్లలోనూ ఇదే టాపిక్. ఇటీవల ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే పలు అరెస్టులు చేసి, కీలక సమాచారాన్ని సేకరించింది. నిధుల దారి ఎటు వెళ్లిందనే అంశంపై దృష్టి పెట్టిన దర్యాప్తు అధికారులు, ఇప్పుడు ‘అంతిమ లబ్ధిదారు’ ఎవరనే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈ కేసులో తెదేపా నేతలు మాత్రం మరింత ముందుకు వెళ్లారు. నేరుగా జగన్ పేరు చర్చల్లోకి తీసుకొస్తున్నారు. లక్షల కోట్లు ముడుపులుగా ఇచ్చారని, అవి చివరికి జగన్‌కే చేరాయని ఆరోపిస్తున్నారు. దీంతో ఆయన అరెస్ట్ ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఇది రాజకీయంగా ప్రభుత్వానికి ఏ మేర నష్టాన్నీ, లాభాన్నీ తెచ్చిపెట్టొచ్చనే చర్చ కూడా కొనసాగుతోంది.
ప్రభుత్వ వర్గాలు మాత్రం దీనిని వ్యూహాత్మకంగా అంచనా వేస్తున్నట్టు సమాచారం. ఎన్నికలకు సమీపంగా అరెస్ట్ చేస్తే సానుభూతి పుంజుకుంటుందని, కానీ ఇప్పుడే ఆ క్రమంలోకి వెళితే నాలుగు సంవత్సరాల వ్యవధి ఉండటం వల్ల ఆ ప్రభావం నీరసమవుతుందని భావిస్తున్నారు. అందుకే కేసును వేగంగా తీసుకెళ్లినా, అరెస్ట్ విషయంలో తొందరపడకపోవచ్చు.
చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న చర్యలు జగన్ ఇమేజ్‌ను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో సాగుతున్నాయని వైసీపీ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అరెస్ట్ వరకు వెళ్ళకపోయినా, ప్రజల్లో జగన్ మీద నెగటివ్ అభిప్రాయాన్ని పెంచే దిశగా కేసు దిశ మళ్లే అవకాశం ఉందని మరికొందరు చెబుతున్నారు. మొత్తానికి జగన్‌ను ఎదుర్కోవడానికి అధికార పక్షం ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందనేది మరికొందరు వాదన. మరి ఈ కేసు విషయంలో ప్రభుత్వం ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందో చూడాలి.