తెరపైకి ఊహించని పేర్లు… ఏపీలో పురుడు పోసుకోకున్న కొత్త కూటమి!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో ఇప్పటికే ఏపీలో టీడీపీ – జనసేన పొత్తులో ఉన్నాయి. అన్నీ అనుకూలంగా జరిగితే ఒకటి రెండు రోజుల్లో వీరితో బీజేపీ కూడా జతకట్టొచ్చని అంటున్నారు.. అలాకానిపక్షంలో వామపక్షాలతో అయినా జతకట్టాలని భావిస్తున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఇప్పటికైతే ఒక కూటమి ఫిక్స్. ఈ సమయంలో అధికార పార్టీ మాత్రం తమకు ప్రజల్తోనే పొత్తు అని చెప్పుకుంటూ ఒంటరిగా బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో మరో కూటమి రాబోతుందని అంటున్నారు.

ఏపీలో సరికొత్త కూటమి తెరపైకి రాబోతుందని అంటున్నారు. నిన్నటివరకూ ఏపీలో ద్విముఖ పోరుమాత్రమే అనే చర్చ జరిగిన అనంతరం… ఏపీపీసీసీ చీఫ్ హోదాలో షర్మిల ఎంట్రీతో సమీకరణలు మారాయని చెబుతున్నారు. అంటే… ఇప్పటికిప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏదో సాధించేస్తాదని కాదు కానీ… ఈ సమయంలో ఆ పార్టీలో చేరే కొంతమంది వ్యక్తులు మాత్రం కచ్చితంగా ప్రభావం చూపిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్స్ కూడా సరికొత్త కూటమికి తెరలేపబోతుందని అంటున్నారు.

ఇందులో భాగంగా… సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్థాపించిన “జై భారత్ పార్టీ” పేరు తెరపైకి వచ్చింది. లక్ష్మీనారయాణ ఆ పార్టీ విధి విధానాలను ప్రకటిస్తూ.. అందులో ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కూడా ఆయన ఆది నుంచి వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో… విభజన హామీల గురించి కూడా ఆయన పేర్కొన్నారు.

వాస్తవానికి ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు కొత్తగా మాట్లాడే పరిస్థితి వైసీపీ, టీడీపీలకు లేదనే చెప్పాలి. అసలు హోదాని నాశనం చేసి, హోదా గురించి నాలుగు రకాలుగా మాటలు మార్చి, ఆ విషయాన్ని అధఃపాతాళానికి తొక్కేసిందే చంద్రబాబు అని అంటుంటారు రాజకీయ పరిశీలకులు. హోదాతో ఏమొస్తుందని చెప్పిన రాజకీయ అనుభవం, చాణక్యం, మేధావితనం బాబు సొంతం!! అందువల్ల… ఇప్పుడు కొత్తగా హోదా పేరు ఎత్తితే చంద్రబాబుకు ఉన్న గౌరవం కూడా పోయే ప్రమాదం లేకపోలేదు!

ఇక కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీలకు తమ ఎంపీలు అవసరం అయితే తప్ప వారి మెడలు వంచి హోదా తెచ్చుకోవడం ఆల్ మోస్ట్ అసాధ్యం అని జగన్ మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పేశారు! ఈదఫా ఎన్నికల్లో ఏమి చెబుతారనేది వేచి చూడాల్సిన అంశం!! ఈ సమయంలో ఎంటరవ్వడం ఎంటరవ్వడమే ప్రత్యేక హోదా డిమాండ్ తో ఏపీలోకి ఎంటరయ్యారు వైఎస్ షర్మిళ! దీంతో… జేడీకి కాంగ్రెస్ పార్టీకీ భావసారూప్యత కలుస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

దీంతో… కాంగ్రెస్ పార్టీతో జై భారత్ పార్టీ కలిసి ఒక కూటమిగా ఏర్పడబోతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో టీడీపీ – జనసేన – బీజేపీ కలిస్తే… అక్కడ వామపక్షాలకు చోటుండదు కాబట్టి… ఈ కూటమితో వారు కూడా కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. వీరితో బీఎస్పీ జతకట్టే విషయాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. ఫలితంగా… ఏపీలో త్వరలో మరో కూటమి కూడా పురుడుపోసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు పరిశీలకులు.